కరోనా: అపార్ట్‌మెంట్లలో​ లాక్‌డౌన్‌  

Apartment People Continuing Lockdown In Nellore Due Coronavirus - Sakshi

ఇంట్లో పనిచేసే వారిని రావద్దంటూ తీర్మానం 

ప్రకాశంలో పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు

హైఅలర్ట్‌ ప్రకటించిన అధికార యంత్రాంగం 

వాచ్‌మన్‌ను బయటకు వెళ్లొద్దంటూ ఆదేశాలు 

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత ఎక్కువగా వెలుగు చూస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ అమలులో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు అందాయి. నిత్యావసరాల కొనుగోలుకు సమయం కుదించారు. ఏదైనా అత్యవసర పనులు మినహా మిగిలిన సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నిబంధనలు ధిక్కరిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇళ్లలో పనిచేసేందుకు వచ్చే పని వారిని రావొద్దని కట్టడి చేశారు. అపార్ట్‌మెంట్ల వాసులు సైతం స్వీయ నిర్బంధానికి తీర్మానం చేసుకుంటున్నారు.

సాక్షి, నెల్లూరు: జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కొందరు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోతున్నారు. మరి కొందరు అయితే విచ్చలవిడిగా నిత్యావసరాలు, అత్యవసరాల పేరుతో రోడ్లపై తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో రెండు రోజుల్లో కరోనా పాటిజివ్‌ కేసులు రాష్ట్రంలోనే అత్యధిక స్థాయికి చేరడంతో అధికారులు, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నగరంలో దాదాపు 1.10 లక్షల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందులో దాదాపు 20 వేల కుటుంబాలు అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్నాయి. ధనవంతులు, మధ్య తరగతి ప్రజలు అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు.

అన్ని సౌకర్యాలతో పాటు ప్రత్యేక రక్షణ చర్యలు ఉండడంతో చాలా వరకు అక్కడే నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి అపార్ట్‌మెంట్ల వాసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ను పాటించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నెల్లూరు నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో కఠినంగా ఉండాలని అపార్ట్‌మెంట్ల వాసులు నిర్ణయించుకుని అమలు చేస్తున్నారు.  

పాటించడం తప్పనిసరి   
కరోనా మహమ్మారి కట్టడికి మా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే అందరం కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నాం. నెల్లూరు నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో గట్టి నిర్ణయాలు తీసుకొని పాటిస్తున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే కఠిన నిర్ణయాలు పాటించాల్సిందే. 
– పోసిన పెంచలయ్య, కార్యదర్శి, శ్రీలక్ష్మీ ప్యారడైజ్‌ అపార్ట్‌మెంట్, నెల్లూరు   

తీర్మాన నిర్ణయాలు  

  • అపార్ట్‌మెంట్లకు కొత్త వ్యక్తుల రాకపోకలు నిలిపివేయడం 
  • తెలిసిన వారు వస్తే బయటకు వెళ్లి వారితో మాట్లాడి పంపించడం 
  • నిత్యావసర సరుకులు ఆన్‌లైన్‌లోనే తెప్పించుకోవడం 
  • తెచ్చిన సరుకులకు కవర్లపై శానిటైజర్‌ను చల్లి తీసుకోవడం 
  • వాచ్‌మన్‌ను ఎలాంటి పనులకు ఉపయోగించుకోకపోవడం 
  • అత్యవసర పనులపై బయటకు వెళ్లిన వారు అపార్ట్‌మెంట్‌ గేటు వద్దే కాళ్లు శుభ్రం చేసుకొని, చేతులను  శానిటైజర్‌తో శుభ్రం చేసుకుని వెళ్లడం 
  • లిఫ్ట్‌ల్లో కూడా భౌతికదూరం పాటించి ఒకరిద్దరు మాత్రమే వెళ్లడం బంధువుల రాకపోకలను  నిలిపివేయడం  
  • అపార్ట్‌మెంట్ల వాసులు బయట ప్రాంతాల నుంచి వస్తే వారితో భౌతికదూరం పాటించడం
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top