
‘సెర్ప్’ను మూసేయండి!
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను మూసేయాలని ఏపీ ఆర్థిక శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పరిపాలన అవసరాల కోసం రూ. 500 కోట్లు ఇవ్వాలని సెర్ప్ కోరటంపై ఆర్థిక శాఖ ఘాటుగా స్పందించింది.
* రూ.500 కోట్లు కోరటంపై ఏపీ ఆర్థికశాఖ ఆగ్రహం
* పది వేల మంది ఉద్యోగులకు లెక్కాపత్రం లేకుండా జీతాలు
* కన్సల్టెంట్లకు, డెరైక్టర్లకు లక్షల్లో వేతనాలు..
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను మూసేయాలని ఏపీ ఆర్థిక శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పరిపాలన అవసరాల కోసం రూ. 500 కోట్లు ఇవ్వాలని సెర్ప్ కోరటంపై ఆర్థిక శాఖ ఘాటుగా స్పందించింది. సొసైటీ కింద ఉన్న సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఏమిటని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. తమ పరిధిలో పది వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి వేతనాలతో పాటు పరిపాలన అవసరాల కోసం రూ.500 కోట్లు అవసరమని సెర్ప్ ప్రతిపాదనలు పంపింది. సెర్ప్‌లో కన్సల్టెంట్లు, డెరైక్టర్లకు నెలకు లక్షలో వేతనాలు చెల్లిస్తున్నారని, ఉన్నతాధికారులకు కూడా లేని వేతనాలు అక్కడ ఉన్నాయని ఆర్థికశాఖ భావిస్తోంది.
కిందిస్థాయి ఉద్యోగులకు మాత్రం నెలకు రూ.6 వేల చొప్పున వేతనాలు ఇస్తూ లెక్కలు వెల్లడించటం లేదంటోంది.డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడం, పొదుపును ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేశారు. 2000లో ప్రపంచ బ్యాంకు అందించిన రూ.2,500 కోట్ల రుణంతో వెలుగుగా ప్రారంభమైంది. తరువాత సెర్ప్‌గా మారింది. గత ఏడాది మార్చితో ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం, ఇచ్చిన రుణం కూడా తీరిపోయింది. మళ్లీ రుణం కోససం ప్రతిపాదనలను చేయగా అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ దీన్ని తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే సెర్ప్ ఇప్పుడు గందరగోళంలో పడింది.