గ్రామ వాలంటీరు పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ | AP Grama Volunteer Notification Released | Sakshi
Sakshi News home page

ఏపీలో గ్రామ వాలంటీర్ల పోస్ట్‌ల నోటిఫికేషన్‌కు జీవో విడుదల

Jun 22 2019 4:47 PM | Updated on Jun 22 2019 7:49 PM

AP Grama Volunteer Notification Released - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన గ్రామ వాలంటీర్‌ ఉద్యోగాల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్‌ కోసం జీవో విడుదల చేసింది. గ్రామ వాలంటీర్ల నియామకాల విధివిధానాలను ఖరారుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో నెంబరు 104ను జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతికి ఏ స్థాయిలోనూ తావులేకుండా చేసే ఉద్ధేశంతోనే ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రభుత్వంలో కొత్తగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులో పేర్కొన్నారు. కులమత, వర్గ, రాజకీయ బేధాలు లేకుండా అర్హులందరికీ చేరవేయడం కోసమే ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు లక్ష్యంగా పేర్కొన్నారు.

ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం నియమించతలపెట్టిన గ్రామ వాలంటీర్ల ఎంపికలో ఏ జిల్లాలో ఎంత మందిని నియమించాలన్నది ఆయా జిల్లా కలెక్టరు నిర్ణయిస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. గ్రామాల వారీగా ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా జిల్లాల వారీగా ప్రభుత్వం ఎంపిక చేసే వాలంటీర్ల సంఖ్యను ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ధారిస్తారు. వాలంటీర్ల ఎంపిక కోసం అసక్తి ఉన్న అర్హులైన అభ్యర్ధులు కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్‌పోర్టల్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. వాలంటీర్ల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా రెండు తెలుగు దినపత్రికలో ప్రకటనలు జారీ చేసి.. ఈ నెల 24వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్‌ ద్వారా అభ్యర్ధుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తారని ఉత్తర్వులో వివరించారు. నియామక ప్రక్రియలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అన్ని కేటగిరిలలో సగం మంది మహిళలకే అవకాశం కల్పిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు.

స్థానికతే ప్రధాన అర్హత...
ఏ గ్రామానికి చెందిన వ్యక్తులను అదే గ్రామంలో వాలంటీర్లుగా నియామకానికి ప్రాధమిక అర్హతగా నిర్ధారిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో వాలంటీర్లుగా నియమితులయ్యే వారు కనీసం పదవ తరగతి, మిగిలిన గ్రామాల్లో వారికి ఇంటర్‌ కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. 18-35 ఏళ్ల మధ్య వయస్సు వారు మాత్రమే దరఖాస్తులు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తుల చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్ధులందరికీ జులై 11వ తేదీ నుంచి 25 తేదీల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించి వాలంటీర్లను ఎంపిక చేస్తారు.  

వేతనాలకు ఏటా రూ.1200 కోట్లు మంజూరు
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాపితంగా గ్రామ వాలంటీర్లు నియమితుయ్యే వారికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఏటా రూ.1200 కోట్లు మంజూరుకు ప్రభుత్వం అనుమతి తెలుపుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆగస్టు ఒకట తేదీ నాటికి రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరు ఎంపికను పూర్తిచేసి, ఎంపికైన వారికి మండలాల వారీగా ఆగస్టు 5వ తేదీ నుంచి పదవ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ అందజేస్తారు. అనంతరం 15వ తేదీ నుంచి వారందరూ కేటాయించిన విధులో చేరిపోతారని పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకునేందుకు.. వెబ్‌సైట్‌ http://gramavolunteer.ap.gov.in చూడవచ్చు.

కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన అందరికీ అందించేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రకటించారు. ఆగస్టు 15వతేదీ నాటికి ప్రతి గ్రామంలోనూ స్థానికులైన యువకులను గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ విధంగా రాష్ట్రంలో 4 లక్షల మందికి గ్రామ వాలంటీర్లుగా ఉపాధి లభించనుంది. ప్రతి ప్రభుత్వ పథకం గడప గడపకు చేరవేసే విధంగా ఈ గ్రామ వాలంటీర్లు పని చేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement