
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి సమీకరించిన భూములతో చేస్తున్న వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేస్తోంది. ఈ భూముల్లోని 4,685 ఎకరాలను పలు రంగాలకు విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే సింగపూర్ కంపెనీలతో పాటు పలు ప్రైవేట్ సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు 2,765 ఎకరాలను విక్రయించింది. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్మిన భూమి 162.43 ఎకరాలు కాగా, మిగిలిన విస్తీర్ణమంతా ప్రైవేట్ సంస్థలకే విక్రయించడం గమనార్హం. తాజాగా.. పర్యాటక, మీడియా, వైద్య, విద్య, ఎలక్ట్రానిక్, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్, ఐటీ రంగాలకు 4,685 ఎకరాలను అమ్మకానికి పెట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సీఆర్‌డీఏ ప్రణాళికలను రూపొందించింది. సింగపూర్ కంపెనీలకు కేటాయించిన 1691 ఎకరాలను మూడు దశల్లో ప్లాట్లు వేసి ఆ కంపెనీలే మూడో పార్టీకి విక్రయించేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ 1691 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇందుకోసం 5,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ భూములను అభివృద్ధి చేసిన తరువాత తాజాగా నిర్ణయించిన 4,685 ఎకరాలను విక్రయించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.
ప్రైవేట్ సంస్థలకు కారు చౌకగా..
ఇదిలా ఉంటే.. భూసమీకరణ ద్వారా రైతుల నుంచి తీసుకున్న ప్రతీ ఎకరానికి పదేళ్లల్లో రూ.4.75లక్షలను మాత్రమే చెల్లిస్తున్న సర్కార్ ఇదే భూమిని ప్రైవేట్ సంస్థలకు ఎకరం రూ.50లక్షలకు విక్రయిస్తోంది. మరోపక్క, ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రం ఎకరం నాలుగు కోట్ల రూపాయల చొప్పున విక్రయించడం గమనార్హం. ఇది రైతుల భూములతో వ్యాపారం చేయడం కాదా అని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థల కోసమే ప్రభుత్వం రాజధాని పేరుతో పెద్దఎత్తున భూ సమీకరణ చేసిందనే విషయం ఇప్పుడు అందరికీ అర్ధమవుతోందని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, విశాఖ వేదికగా ఈ ఏడాది జనవరిలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో సీఆర్‌డీఏ పలు ప్రైవేట్ సంస్థలతో ప్రధానంగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలను చేసుకుంది. దీని ప్రకారం ఆయా సంస్థలకు రాజధానిలో వందల ఎకరాలను విక్రయించనుంది. ఏ రంగానికి ఎన్ని ఎకరాలను అమ్మాలో సీఆర్‌డీఏ నిర్ణయించింది.