జాతీయ రహదారులపై.. ‘వైఎస్సార్‌ అత్యవసర చికిత్స’

 Ap Government Launched YSR Emergency Treatment - Sakshi

ప్రమాద బాధితులకు తక్షణ వైద్యమే సర్కారు లక్ష్యం

ప్రతి 50 కి.మీ.లకు ఒకటి చొప్పున త్వరలో మొత్తం 90 కేంద్రాల ఏర్పాటు

రూ.72 కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సంభవించే ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఈ రహదారులపై త్వరలో ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రహదారి అత్యవసర చికిత్స కేంద్రాలు’ ఏర్పాటుచేయనుంది. రాష్ట్రం మీదుగా వెళ్లే అన్ని జాతీయ రహదారులపై ఈ హైవే ఎమర్జన్సీ క్లినిక్‌లకు (హెచ్‌ఈసీ) శ్రీకారం చుడుతోంది.

రాష్ట్రంలో మొత్తం 4,500 కి.మీ. మేర ఉన్న ఈ రహదారుల్లో ప్రతి 50 కి.మీ.కు ఒక హెచ్‌ఈసీ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలా మొత్తం 90 క్లినిక్‌లు ప్రారంభించనున్నారు. ఒక్కో క్లినిక్‌కు రూ.80 లక్షలు చొప్పున మొత్తం 90 క్లినిక్‌లకు రూ.72 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిల్లో హెచ్‌ఈసీలో శిక్షణ పొందిన పారా మెడికల్‌ సిబ్బందిని నియమిస్తారు. ఈ కేంద్రాలను 108 సర్వీసుతో అనుసంధానిస్తారు.

సత్ఫలితాలివ్వని ట్రామా కేర్‌లు
రాష్ట్రంలో చెన్నై–కోల్‌కత, విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారులపై అత్యధికంగా ప్రమాదాల రేటు నమోదవుతోంది. వీటిపై గతంలో ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు కమిటీ ఆదేశించినా గత సర్కారు పెడచెవిన పెట్టింది. ఫలితంగా జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తరచూ అనేకమంది క్షతగాత్రులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాగా, క్షతగాత్రుల కోసం గతంలో రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ రాష్ట్రవ్యాప్తంగా 32 ట్రామాకేర్‌ ఆస్పత్రులు గుర్తించింది.

వీటిలో 19 ప్రభుత్వాస్పత్రులు కాగా, 13 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. అయితే, ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే, రవాణా శాఖ గుర్తించిన ప్రైవేటు ట్రామాకేర్‌ ఆస్పత్రుల నిర్వాహకులు క్షతగాత్రులను చేర్చుకునేందుకు ఇబ్బందులు పెట్టారు. దీంతో వారు కూడా సకాలంలో చికిత్స అందక తీవ్రంగా నష్టపోతున్నారు.

మరోవైపు..రోడ్డు ప్రమాదానికి గురైన గంటలోపు (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రిలో చేరిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే వీలుంది.కానీ, ట్రామాకేర్‌ ఆస్పత్రులలో సదుపాయాలు లేకపోవడంతో జనరల్‌ ఆస్పత్రుల్లో బాధితులు బెడ్లు లేక క్యాజువాలిటీలోనే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇలా ఒక్కో జనరల్‌ ఆస్పత్రికి వస్తున్న కేసుల సంఖ్య రోజుకు ఎనిమిది నుంచి పది వరకు ఉంటున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు వీలుగా వైఎస్సార్‌ రహదారి చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top