మనిషికి హుందాతనాన్నిచ్చేది. వేసవిలో చల్లదనం, శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఖాదీ అంటే ఇష్టపడని వారుండరు.
పొందూరు, న్యూస్‌లైన్: మనిషికి హుందాతనాన్నిచ్చేది. వేసవిలో చల్లదనం, శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఖాదీ అంటే ఇష్టపడని వారుండరు. ఖాదీ అనగానే శ్రీకాకుళం జిల్లా పొందూరు గుర్తుకొస్తుంది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి పొందూరు ఖాదీ ఖ్యాతి పొందింది. గాంధీ మహాత్ముడు 1921లో యంగ్ ఇండియా పత్రికలో రాసిన ఒక వ్యాసంలో పొందూరు ఖాదీని చుక్కల్లో చంద్రునిగా అభివర్ణించారు. అయితే దీనికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన వారు మాత్రం మహానటుడు అక్కినేని నాగేశ్వరరావే. 43 ఏళ్లుగా పొందూరు ఖాదీ పంచెలనే ధరించిన ఆయన స్వయంగా ఒక డిజైన్ రూపొందించారు. అదే ఏఎన్నార్ పంచెగా విశ్వవిఖ్యాతి సాధించింది. తను నటించిన పలు సినిమాల్లో ఈ దుస్తులు ధరించడమే కాకుండా పొందూరు ఖాదీ విశిష్టతను తెలిపే సంభాషణలు, పాటలు రాయించేవారు.
- ఏఎన్నార్ బ్రాండ్ పంచెలను దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ధరించేవారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి తదితర ప్రముఖులూ వీటినే ధరిస్తున్నారు.
- {పస్తుతం ఏఎన్నార్ అంచు పంచెలు రెండు రకాలుగా వస్తున్నాయి. 5 సె.మీ. వెడల్పుతో ఉన్న అంచును సింగిల్ బోర్డర్ అని, 10 సె.మీ.వెడల్పుతో ఉన్న దాన్ని డబుల్ బోర్డర్ అని అక్కినేనే నామకరణం చేశారు.
- సింగిల్ బోర్డర్ పంచె ఖరీదు రూ.3600, డబుల్ బోర్డర్ ఖరీదు రూ. 6500 ఉంటుంది. సగటున ఏటా రూ. 5.5 లక్షల విలువైన ఏఎన్నార్ పంచెలను ఇక్కడ తయారు చేస్తున్నారు.
- చేనేత విభాగంలో తక్కువ ధరకు దొరికే ఏఎన్నార్ అంచు పంచెలు కూడా ఉన్నాయి. ఒక్కో పంచె ఖరీదు రూ 520.
- ఖాదీ వస్త్రాల ధరలు ప్రజలకు అందుబాటులో లేవని, కొంచెం తక్కువ రకం నూలు కలిపైనా ఖాదీ వస్త్రాలను చౌకగా విక్రయించాలన్నది అక్కినేని అభిప్రాయం. కనీసం 60 శాతం మం దైనా ఖద్దరు ధరించే పరిస్ధితి రావాలన్నది ఆయన ఆకాంక్ష.
కొండంత ధైర్యం..?
నిరాశా నిస్పృహలకు గురైనప్పుడల్లా అక్కినేని నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు. షూటింగ్ సమయంలో ఆయన ఉంటే చాలు కొండంత ధైర్యంగా ఉండేది. 1954లో అక్కినేనితో కలిసి మొదటిసారి ‘నిరుపేదలు’ సినిమాలో నటించాను. ఆ సినిమాలో.. ‘నారాయణా.. దొంగతనం చేశావా’ అని గద్గద స్వరంతో పలకాలి. 20 సార్లు ఆ డైలాగ్ చెప్పినా గద్గద స్వరం రాలేదు. నిరాశతో నేను కుర్చీలో కూర్చుండిపోయాను. వెంటనే అక్కినేని నా దగ్గరకు వచ్చి.. ‘బాధపడొద్దు. ఇలాంటివి మామూలే. ఇంటికి వెళ్లి ప్రాక్టీస్ చెయ్యి వస్తుంద’న్నారు. ఇంటికి వెళ్లి చాలా సేపు అద్దం ముందు కూర్చుని ప్రాక్టీస్ చేశాను. గొంతులో వణుకు వచ్చేసింది. ఆ ఒక్క సినిమాయే కాదు. చాలా సినిమాల్లో ఆయన ప్రోత్సాహం మరిచిపోలేనిది. ఆయనతో కలిసి నేను నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆయన తను బతికి ఉన్నంత కాలం నటిస్తూనే ఉంటానని చెప్పారు. చెప్పినట్లుగానే చివరి వరకూ నటించారు.
- జమున, సినీ నటి
పాట పాడించుకుని విన్నారు..
1959లో అక్కినేనితో పరిచయం జరిగింది. అది మొదలు చివరి క్షణం వరకు మా మధ్య స్నేహం కొనసాగింది. తొలిసారి ఎన్టీఆర్ కు పాటలు రాసేందుకు మద్రాస్ వెళ్లినప్పుడు అక్కినేని నన్ను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. పది రోజుల కింద అక్కినేనిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు.. తనకు ఇష్టమైన ధర్మదాత సినిమాలోని ‘జోలాలీ..’ పాటను నాతో పాడించుకుని విన్నారు. ఆయన అస్తమయం బాధాకరం. 70 ఏళ్లకు పైగా వెండితెరపై ప్రకాశించిన అక్కినేనికి భారతరత్న ఇస్తే తగిన రీతిలో గౌరవించిన వారం అవుతాం.
- సినీ రచయిత సి.నారాయణరెడ్డి