తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొనే దిశగా రాష్ట్రం పయనిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 670 మండలాల్లో సగం ఇప్పటికే వర్షభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొనే దిశగా రాష్ట్రం పయనిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 670 మండలాల్లో సగం ఇప్పటికే వర్షభావాన్ని ఎదుర్కొంటున్నాయి. నిన్న మొన్నటి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు లోటు వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వ గణాంక సాధికార సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి మినహా మిగతా జిల్లాల్లో పరిస్థితి సజావుగా లేదు. రాయలసీమతో పోల్చుకుంటే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరులో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. 161 మండలాల్లో సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా, 200 మండలాల్లో మాములు వర్షపాతం నమోదైంది.
మిగతావాటిల్లో 238 మండలాలు తీవ్ర వర్షభావాన్ని ఎదుర్కొంటుండగా 71 మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయి. గత వారం వరకు రాష్ట్రంలో సగటున 12 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు చూపిన ప్రభుత్వం తొలిసారి సగటు లోటు 2.3 శాతంగా ప్రకటించింది. అనధికారిక లెక్కల ప్రకామైతే అది రెట్టింపుగా ఉంది. గత ఏడాది సగటు వర్షపాతం లోటు 32 శాతం నమోదైన విషయం తెలిసిందే.