ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా

Andhra Pradesh Legislative Council Adjourned Sine Die - Sakshi

టీడీపీ నేతలపై మంత్రి అనిల్‌ ఫైర్‌

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. దీంతో శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ప్రకటించారు. అంతకుముందు గోదావరి జలాలపై శాసన మండలిలో చర్చ సందర్భంగా జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తెలంగాణతో కలిసి గోదావరి నీటి జాలాల మల్లింపుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై ఎటువంటి నిర్ణయాలు రాకముందే టీడీపీ సభ్యులు గోలగోల చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నీటి లభ్యత వ్యవహారాలు చూసిన తరువాతే తెలంగాణతో చర్చలు మొదలయ్యాయని స్పష్టం చేశారు. చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నట్టు.. చీకటి ఒప్పందాలు చేసుకునే సంస్కృతి తమది కాదని చురకలంటించారు. నాడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేటప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. 

ఎవరికీ అనుమానాలు లేవు..
పోలవరాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేస్తారని.. ఇది భగవంతుడి నిర్ణయమని అన్నారు. రివర్స్ టెండరింగ్‌ ద్వారా ప్రాజెక్టులో రూ.100 కోట్లు తగ్గించిన తమ ప్రభుత్వం.. ప్రజాధనాన్ని కాపాడినట్లేనని అన్నారు. గోదావరి జలాలపై ప్రజలెవరికీ అనుమానాలు లేవని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉపయోగపడే పనులే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపడతారని వెల్లడించారు. ఇది తెలుగుదేశం సభ్యులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇక ఈ సమావేశాల్లో మండలిలో 9 బిల్లులు ఆమోదం పొందాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top