వైఎస్‌ జగన్ ‌: పర్యావరణ విధ్వంసాన్ని ఉపేక్షించం | AP Introduced Green Tax to Prevent Pollution - Sakshi
Sakshi News home page

పర్యావరణ విధ్వంసాన్ని ఉపేక్షించం

Published Fri, Sep 27 2019 4:05 AM

Andhra Pradesh Government Introduced Green Tax to Control Pollution - Sakshi

సాక్షి, అమరావతి : పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మన పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోకపోతే, భవిష్యత్‌ తరాలు ఎలా బతకగలుగుతాయనే ఆలోచన చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో మనం దేశానికి మార్గదర్శకంగా నిలవాలని, ఇందులో భాగంగా అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్న వివిధ దేశాల్లోని పద్ధతులను అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై నెలలోగా అత్యుత్తమ విధానాలను సూచిస్తూ ప్రతిపాదనలు రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లులు పెట్టి చట్టం తీసుకు వద్దామని చెప్పారు. దేశానికే మార్గదర్శకంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ విధానం ఉండాలని స్పష్టీకరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యత సర్కారుదే
పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని, ఆ మేరకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధిస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో సమూల ప్రక్షాళన చేయాలని సూచించారు. విశాఖపట్నం కాలుష్యంతో అల్లాడుతోందని, దీనిని నియంత్రించకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు విశాఖ నగరంలో పెద్దపీట వేయాలని సూచించారు. పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయంటే.. రెడ్‌ కార్పెట్‌ వేస్తామని, అయితే వాటి నుంచి ఎలాంటి కాలుష్యం వస్తుందనే దానిపై మనం ఆలోచించడం లేదన్నారు.

వాతావరణానికి, పర్యావరణానికి ఎలాంటి భంగం కలుగుతుందనే దానిపై దృష్టి పెట్టడం లేదని, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మాత్రమే ఆలోచిస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ పట్ల సమగ్ర అవగాహన, పరిజ్ఞానం, అంకిత భావం ఉన్న వారు ఈ వ్యవస్థల్లో ఉండాలని చెప్పారు. పరిశ్రమలు నడుపుతున్న వారికి వేధింపులకు గురవుతున్నామనే భావన రానీయకూడదని సూచించారు. ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా ఆలోచించి ఉత్తమ విధానాలను మనం అనుసరించాలని అన్నారు.  

గ్రామ వలంటీర్ల ద్వారా మొక్కల పంపిణీ
గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ నాలుగు మొక్కలు పంపిణీ చేయాలని, చెట్లను పెంచడంలో వారి సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు గ్రామ వలంటీర్లందరికీ మొక్కలు అందుబాటులో ఉంచాలన్నారు. మొక్కలను పెంచడానికి  కాల్వ గట్లను పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. అనంతపురం, కడప ప్రాంతాల్లో అడవులను పెంచడంపై దృష్టి సారించాలని, తద్వారా ఆ ప్రాంత నైసర్గిక స్వరూపాన్ని మార్చాల్సిందిగా సీఎం సూచించారు.

పంట కాల్వలను కాపాడుకోవాలని, అవి కాలుష్యానికి గురవ్వకుండా నిరోధించాలని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో కాల్వలను పరిరక్షించేందుకు ‘మిషన్‌ గోదావరి’ పేరుతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. దీనిపై సరైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆక్వా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయాలని.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలన్నారు.

ఇ–వేస్ట్‌ కోసం కాల్‌ సెంటర్‌
ఇ–వేస్ట్‌ కోసం కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. లక్ష టన్నుల వ్యర్థాలు ఫార్మా కంపెనీల నుంచి వస్తే అందులో సుమారు 30 శాతం మాత్రమే శుద్ధి చేస్తున్నారని, మిగతా 70 శాతం వాతావరణంలోకి వదిలేస్తున్నారని సీఎం తెలిపారు. హేచరీ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారన్నారు. ఇవాళ ఏపీ నుంచి పెద్ద ఎత్తున సముద్రపు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, ఇందులో మనం దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేచరీ జోన్‌గా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.

ఫార్మా కంపెనీల కోసం ఇప్పటికే మనం ఫార్మా సిటీలను ఏర్పాటు చేశామని, అక్కడే వాటిని పెట్టుకునేలా వారికి అనుతులు ఇచ్చి ఉండాల్సిందన్నారు. వేస్ట్‌ మేనేజ్‌మెంట్, మురుగు నీటి పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని, మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాతే విడిచి పెట్టాలని సూచించారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌పై ఫ్రెంచి ప్రతినిధి బృందంతో చర్చించానని తెలిపారు. అటవీ శాఖ వద్ద ఉన్న ఎర్ర చందనాన్ని ఏకమొత్తంగా అమ్మే పద్ధతిలో కాకుండా విడతలుగా అమ్మితే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని చెప్పారు. వాల్యూ యాడ్‌ చేసి విక్రయిస్తే ప్రభుత్వానికి మరింత మేలు జరుగుతుందని సూచించారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా చైనా, జపాన్‌ సంస్థలతో చర్చలు జరపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement