
ప్రాజెక్టులకూ ల్యాండ్ పూలింగే
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములు సమీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
సీఎం చంద్రబాబు వెల్లడి
పీపీపీ విధానంలోనే విశాఖ అంతర్జాతీయ
ఎయిర్‌పోర్టు, భావనపాడు పోర్టుల నిర్మాణం
ఏషియన్ పెయింట్స్‌తో ప్రభుత్వం ఎంవోయూ
హైదరాబాద్: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములు సమీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ భూములున్నాయో గుర్తించాలని ఎమ్మెల్యేలకు చెప్పానని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఏపీ ప్రభుత్వం ఏషియన్ పెయింట్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ విశాఖ జిల్లా పూడి వద్ద ఏటా 4 లక్షల కిలో లీటర్ల సామర్ధ్యంతో రూ. 1,750 కోట్లతో రంగుల పరిశ్రమను స్థాపించనుంది. ఇందుకు ప్రభుత్వం 110 ఎకరాలు కేటాయించింది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభానికి నాలుగున్నరేళ్ళ సమయం పడుతుందని ఏషియన్ పెయింట్స్ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.
అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ..ఈ భారీ పరిశ్రమ ద్వారా 700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, అటవీ, డీకేటీ పట్టా భూములు తీసుకొని ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కర్నూలులో 33 వేల ఎకరాలు, ప్రకాశంలో 60 వేల ఎకరాల వరకు భూమి అందుబాటులో ఉందన్నారు.
ప్రభుత్వం కేటాయించిన భూముల్లో సకాలంలో పరిశ్రమలు స్థాపించకుంటే ఆ భూముల్ని వెనక్కు తీసుకునే అధికారాల్ని కలెక్టర్లకు ఇచ్చినట్లు చెప్పారు. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం, భావనపాడులో పోర్టు ఏర్పాటు చేసేందుకు ల్యాండ్ పూలింగ్‌లోనే భూములు తీసుకుంటామని వివరించారు. పీపీపీ విధానంలో వీటిని నిర్మిస్తామన్నారు. విశాఖ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును హైదరాబాద్‌కంటే మెరుగ్గా నిర్మిస్తామని తెలిపారు. ఈ నెల 13న విశాఖలో మౌలిక సదుపాయాల మిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అన్ని అనుమతులు 21 రోజుల్లో వచ్చేందుకు సింగిల్ డెస్క్‌ను ఏప్రిల్ 3న ప్రారంభిస్తామన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి తన డ్రీమ్ సిటీలని చెప్పారు.