కట్టలు తెంచుకున్న ఆగ్రహం

Agrigold Victims Fires on Officials - Sakshi

అగ్రిగోల్డ్‌ బాధితుల ఆక్రోశం

టోకెన్లు పంపిణీ లేదనడంతో రోడ్డెక్కిన వైనం

న్యాయసేవాసదన్‌ కార్యాలయంపై దాడి

పోలీసుల అదుపులో నలుగురు

ఈ నెల 22 వరకూ దరఖాస్తులు స్వీకరణ

పోలీసులకు టోకెన్ల జారీ బాధ్యతలు అప్పగింత

విజయనగరం టౌన్‌:  అగ్రిగోల్డ్‌ బాధితుల ఆవేశం కట్టలు తెంచుకుంది. జిల్లా నలుమూలల నుంచి ఎంతో వ్యయప్రయాసలకోర్చి జిల్లాకు చేరుకున్న బాధితులు మంగళవారం ఉదయం  నాలుగు గంటల నుంచే జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద బారులు తీరారు.  తీరా టోకెన్లు ఇవ్వడం జరగదనే విషయాన్ని తెలుసుకున్న వారంతా ఒక్కసారిగా కోపోద్రిక్తులై  రోడ్డెక్కి  నిరసన తెలిపారు. జాతీయ రహదారిని ముట్టడించారు.  న్యాయసేవాసదన్‌ కార్యాలయంపై దాడులు చేసి అద్దాలు ధ్వంసం చేశారు.  సంస్ధ చైర్మన్‌ ఆలపాటి గిరిధర్, సంస్థ కార్యదర్శి లక్ష్మీరాజ్యంలను  బాధితులు నిలదీశారు. దీంతో వారు బాధితులకు సర్దిచెప్పి, వెనువెంటనే సాధారణంగా ఇచ్చే టోకెన్ల కౌంటర్లతో పాటూ అదనంగా మరో మూడు కౌంటర్లు ఏర్పాటుచేశారు. మార్చి 11తో ముగియాల్సిన ప్రక్రియ ఈ నెల 22 వరకూ పెంచుతున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.

రోడ్డెక్కిన నిరసన
వేకువజామున 4 గంటల నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులు జిల్లా న్యాయసేవాసదన్‌ కార్యాలయం వద్ద బారులు తీరారు. సుమారు ఆరువేల మంది బాధితులు టోకెన్ల కోసం చేరుకున్నారు.  అప్పటికే టోకెన్లు ఇవ్వరన్న విషయం తెలుసుకున్న బాధితులు నిరసన గళం వినిపించారు. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణమంతా బాధితులతోనే నిండిపోయింది. దీంతో కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయమేర్పడింది.

పోలీసుల అదుపులో నలుగురు
అగ్రిగోల్డ్‌ బాధితుల ఆక్రోశానికి  టోకెన్ల కౌంటర్ల అద్దాలు పగిలిపోయాయి. దీంతో  అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  పోలీసుల రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం జిల్లా న్యాయసేవాసదన్‌ ప్రతినిధులు టోకెన్ల ప్రక్రియను పోలీసులకు అప్పగించారు. దీంతో బుధవారం నుంచి పోలీసుల సమక్షంలో టోకెన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

సరైన ధ్రువపత్రాలు తీసుకురావాలి
పోలీసుల అదుపులో టోకెన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో  టోకెన్లకు వచ్చే వారు తప్పనిసరిగా అగ్రిగోల్డ్‌ ఒరిజినల్‌ బాండ్‌ పేపర్‌ను చూపించాల్సి ఉంటుంది. అదే విధంగా ఏరోజైతే  టోకెన్‌పై వెరిఫికేషన్‌కి ఇచ్చారో ఆ రోజున ఒరిజినల్స్‌ జెరాక్స్‌ కాపీలు, రెవెన్యూ స్టాంప్, తదితర వాటిని సమర్పించాల్సి ఉంటుంది.  ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించేది లేదు. ఇప్పటికే ఈ విషయంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. మరికొందరిని గుర్తిస్తున్నాం. బాధితులు సంయమనం పాటించాలి.– ఫక్రుద్దీన్, రూరల్‌ ఎస్‌ఐ, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top