కరువు ఉరిమింది.. పల్లె పొమ్మంది!


డొక్కల కరువు సంభవించి ఊళ్లకు ఊళ్లే వలసపోయాయని, తిండీ తిప్పలు లేక వందలాది మంది మృత్యువాత పడ్డారని జిల్లా చరిత్ర చెబుతోంది. బ్రిటీష్ కలెక్టర్ సర్ థామస్ మన్రో ‘అనంత’ కరువును చూసి చలించిపోయి ఆనాడు జిల్లా వ్యాప్తంగా గంజి కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రాణాలు కాపాడారు. అందుకే ఆయన జయంతి, వర్ధంతిని జిల్లా వాసులు ఘనంగా జరుపుకుంటారు. జిల్లా కరువుపై విదేశీ పాలకుడే అంతగా స్పందించినపుడు.. ఈ ప్రాంత వాసులైన ఇప్పటి పాలకులు ఇసుమంతైనా స్పందించక పోవడం ఆవేదన కలిగిస్తోంది.    

 

 అనంతపురం సెంట్రల్: జిల్లాలో గతేడాది సాధారణ వర్షపాతంలో (సాధారణ వర్షపాతం 552 మి.మీ కా గా నేటికీ 274 మి.మీ మాత్రమే నమోదైంది) యాభై శాతం మాత్రమే నమోదు కావడంతో లక్షలాది ఎకరాలు బీళ్లుగా మారిపోయాయి. పంటలు సాగు చేసిన రైతులకు అపార నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఉన్న ఊరిలో పనిలేక.. అప్పులు తీర్చేందుకు మార్గం లేక జనం వలసబాట పడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఆలసత్వం కారణంగా వలసలు ని యంత్రించాల్సిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల లేమి సమస్యగా మారింది. జిల్లాలో 7.61 లక్షల కుటుంబాలు (జాబ్ కార్డు పొం దిన వారి సంఖ్య) ఈ పథకంపై ఆధారపడ్డాయి.

 

 ఇందులో 18,20,780మంది కూలీలు ఉన్నారు. జాబ్‌కార్డు పొం దిన వారిలో 4.50 లక్షలమంది కూలీలు నిత్యం పనులకు వస్తున్న వారిలో ఉన్నారు. వీరిలో చిన్న, సన్నకా రు రైతులు సైతం ఉన్నారు. అయితే వీరందరికీ పను లు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1006 పంచాయతీలుం డగా కేవలం 680 పంచాయతీల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. అదికూడా అరకొరగానే జరుగుతుండడంతో గ్రామంలోని కూలీలందరూ ఉపాధి పనులకు పోవడానికి ఆస్కారం లేకుండాపోతోంది. 4.50 లక్షలకు పైగా కూలీలు ఉన్న జిల్లాలో కేవలం 62 వేల మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తుండడం అధికారుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

 

 పాలకుల నిర్లక్ష్యం.. కూలీలకు శాపం  

 ప్రచార్భాటాల కోసం నిత్యం తహతహలాడే ప్రజాప్రతినిధులు ఉపాధి కూలీల సమస్యలపై దృష్టి సారించడం లేదు. కొండగుట్టలో చేతులు బొబ్బలు పోయేలా శ్రమటోడ్చి చేసినా వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదు. కొత్తచెరువు మండలంలో దాదాపు ఏడాది కావస్తున్నా బిల్లులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కూలీలు రెండ్రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ. 20 కోట్లు మేర ఉపాధి కూలీల వేతనాలు బకాయిగా పేరుకుపోయాయి. దీనికి తోడు పండ్లతోటల పెంపకం చేపడుతున్న రైతులకు వాచన్‌వార్డ్ బిల్లులు దాదాపు రూ. 45 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. చెట్లకు నీరు పోసేందుకు కాదు కదా  రైతులు నాటుకున్న మొక్కలకు కూడా బిల్లులు ఇవ్వడం లేదు. జిల్లాలో ఈ తరహా పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధుల్లో మాత్రం చలనం లేదు.

 

 నిధుల సమస్యల లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కూలీలకు బకాయి వేతనాలు, బిల్లులు ఎందుకు చెల్లించడం లేదనే అంశాలపై దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవు. ఫలితంగా రైతులు, రైతు కూలీలు ఉన్న ఊళ్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి లేక కుటుంబాలే వలస పోతుంటే అధికారులు మాత్రం పని కల్పిస్తున్నా వలస వెలుతున్నారనే ధోరణిలో మాట్లాడుతున్నారు. బెంగుళూరు, హోసూరు ప్రాంతాల్లో ఎలాంటి కష్టం లేకుండానే ఎక్కువ డబ్బులు వస్తుండడంతో ఆ విధంగా అలవాటు పడ్డారని చెబుతుండడం గమనార్హం.

 

  నల్లచెరువు, ఆమడగూరు, తనకల్లు, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, రాయదుర్గం, గుమ్మగట్ట, శెట్టూరు తదితర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 50 వేల నుంచి 55 వేల కుటుంబాల వరకూ ఇతర ప్రాంతాల వలస పోయింటారని అధికారులు భావిస్తున్నారు. మండల పోగ్రాం ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓలు ఉపాధిహామీ పథకంపై ఏమాత్రం దృష్టి కేంద్రీకరించడం లేదు. తమకు అదనంగా సౌకర్యాలు కల్పిస్తే తప్పా ఉపాధిహామీ పథకంలో జోక్యం చేసుకోమని ఇటీవల జరిగిన సమావేశంలో ఆశాఖ కమీషనర్ ఎదుట కుండబద్దలు కొట్టారు.

 

 

 

 ఏడాది నుంచి కూలి డబ్బులు ఇవ్వలేదు

 ఉపాధి పనులు చేసి యేడాది అవుతోంది. ఇప్పటికీ బిల్లులు ఇవ్వలే దు, పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చేతులు బొబ్బలు వచ్చేలా పనులు చేశాము. మా కూలిడబ్బులు మాకు  చెల్లించక అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. దాదాపు రూ.2,300ల దాకా ఉపాధి బిల్లులు రావాల్సి ఉంది.  

 -పద్మావతి, కొడపగానిపల్లి, కొత్తచెరువు మండలం

 

 బిల్లులు ఇవ్వరు.. ఉపాధి చూపించరు

 ఉపాధి పనులు కల్పిస్తామని అధికారులేమో చెబుతున్నారే తప్ప ఇప్పటికీ మాకు ఎలాంటి పనులు చూపలేదు. అసలే వర్షాలు లేక బోర్లలో నీరు ఎండిపోవడంతో ఒక పక్క రైతు కూలీ పనులు లేక మరో పక్క ఉపాధి పనులు కల్పించకపోవడంతో పూటగడవడమే కష్టంగా మారింది. మా గ్రామంలో దాదాపు 300 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ప్రతి రోజూ  కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మా గ్రామాన్ని సందర్శించిన సోషల్ ఆడిట్ వారు ఉపాధి పనులు కల్పిస్తారని చెప్పారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి పనులు చూపలేదు.

 -రామాంజినేయులు, కొడపగానిపల్లి, కొత్తచెరువు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top