దరఖాస్తు దాటని ‘ఫీజు’ కథ | Aadhaar mandatory for fees reimbursement | Sakshi
Sakshi News home page

దరఖాస్తు దాటని ‘ఫీజు’ కథ

Nov 19 2013 3:27 AM | Updated on Sep 5 2018 9:00 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రోజుకో కొత్త నిబంధనను తీసుకుని వస్తూ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తోంది.

 కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ :  ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రోజుకో కొత్త నిబంధనను తీసుకుని వస్తూ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తోంది. దానికి  కళాశాలల ప్రిన్సిపాళ్ల నిర్లక్ష్యం కూడా తోడవడంతో ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. మొత్తం విద్యార్థుల్లో ఇప్పటి వరకు సగం మందికూడా దరఖాస్తులు ఇవ్వలేకపోయారు. ఈ నెలాఖరుకు గడువు ముగుస్తుండడంతో విద్యార్థుల్లో ఆందోళన తీవ్రమవుతోంది.
 గతేడాది వరకు ఆధార్‌కార్డు నంబర్, వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) నంబర్ లేకున్నా విద్యార్థులు ఫీజుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండింది.
బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు గతేడాది చదివిన కోర్సుకు సంబంధించిన మార్క్స్‌మెమో, బ్యాంక్ పాసు పుస్తకం మొదటి పేజీని స్కాన్ చేసి ఈ పాస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోయేది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ ధ్రువీకరణ పత్రాలన్నింటితో పాటు ఆధార్‌కార్డు, హైసెక్యూరిటీ పాస్ వర్డ్ వచ్చేందుకు వీలుగా మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉండాలని నిబంధనలు పెట్టింది. నిరుపేద కుటుంబాల్లో ఒకే సెల్‌ఫోన్ ఉంటే ఆ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఆ నంబర్‌ను ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. మిగిలిన వారి కోసం మళ్లీ ఫోన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బంధువులు లేక ఇతరుల మొబైల్ నంబర్ ఇస్తే వారికి మెసేజ్‌లు వెళ్తాయి కాబట్టి భవిష్యత్‌లో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

అలాగే ఆధార్‌కార్డు లేనివారు కూడా ఫీజుకు దరఖాస్తు చేసేందుకు అనర్హులు. జిల్లాలో ఫీజుకు అర్హులైన విద్యార్థులు అన్ని కోర్సుల్లో కలిపి (ఫ్రెష్, రెన్యూవల్) దాదాపు 1 లక్ష మంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 44 వేల మంది మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 56 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అందులో చాలా మంది విద్యార్థుల వద్ద ఆధార్ (యూఐడీ)నంబర్లు లేవు. కేవలం ఈఐడీ నంబర్లు మాత్రమే ఉన్నాయి. యూఐడీ నెంబర్లను మాత్రమే సిస్టమ్ అంగీకరిస్తుండడంతో ఈఐడీ నంబర్లున్న విద్యార్థులు డీలా పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈఐడీ నంబర్లు ఉన్న విద్యార్థులు వారు చదువుతున్న కళాశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా ఆయా నంబర్లను జిల్లా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయానికి పంపితే వారికి యూఐడీ నంబర్లను తెప్పిస్తామని జిల్లాస్థాయి అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ విషయంలో స్పందించకపోవడం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే అవకాశం ఉంది. అర్హత కలిగిన విద్యార్థులందరూ ఆధార్ నమోదు చేసుకునేలా జిల్లా అధికార యంత్రాంగం పలు ప్రాంతాల్లో ఆధార్ కిట్లు ఏర్పాటు చేసినా, అనుకున్న స్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. దానికితోడు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించడంతో ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement