కోమలి.. విషాద ఝరి

40 Years Compleat Church Collapsed in Komali Village Guntur - Sakshi

చర్చి కూలి నేటికీ 41ఏళ్లు పూర్తి

99 మంది మృత్యువాత

ఏడేళ్ల క్రితం ట్రాక్టర్‌ ప్రమాదంలో 11మంది దుర్మరణం

కోమలి(పిట్టలవానిపాలెం):  నవంబర్‌ 19.. గత 41 ఏళ్లుగా ప్రతి ఏడాది ఆ తేదీ కోమలి గ్రామంలో ప్రతి ఒక్కరిని పుట్టెడు దుఃఖంలో ముచ్చెత్తుతోంది. ప్రకృతి ప్రకోపమో... మానవ తప్పిదాలో ఆ గ్రామ ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. పేరుకు తగ్గట్టుగానే కోమలి భౌగోళికంగా చాలా సున్నితమైన ప్రాంతం. నిజాంపట్నం సముద్రతీరానికి కూతవేటు దూరంలో ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడల్లా కోమలి గ్రామం ఉలిక్కిపడుతుంది. సరిగ్గా 41 ఏళ్ల క్రితం 1977 నవంబర్‌ 19న రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన దివిసీమ తుఫాన్‌ కోమలి గుండెలపై చెరగని ముద్రవేసింది. తుఫాన్‌ భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రామానికి చెందిన దళితులు సమీపంలోని ప్రార్థనా మందిరంలో  తలదాచుకున్నారు.

బిక్కుబిక్కుమంటూ క్షణం ఒక యుగంలా గడిపారు. భయంకర తుఫాన్‌ వీరికి ఎలాంటి హాని కలిగించలేదు. కానీ ప్రార్థనా మందిరం ఒక్కసారిగా కూలిపోవడంతో ఎందరో మృత్యువాత పడ్డారు. సుమారు 99 మంది ఈ శిథిలాల కింద తుదిశ్వాస విడిచారు. ఈ దురదృష్ట ఘటనకు ప్రతీకగా ప్రార్థనా మందిరం కూలిన ప్రదేశంలోనే స్థూపం నిర్మించారు. ప్రతి ఏడాది నవంబర్‌ 19 వ తేదీన స్థూపం వద్ద నివాళుల         ర్పించే దళితులు దేవుడా మళ్లీ ఇలాంటి పరిస్థితిని రానివ్వకు ప్రభు అంటూ వేడుకుంటారు. ఏడేళ్ల  క్రితం గ్రామానికి చెందిన కొందరు ట్రాక్టర్‌పై  శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా పిట్టలవానిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం సమీపంలో తెనాలి–నిజాంపట్నం కాలువలో ట్రాక్టర్‌ ట్రక్కు బోల్తా కొట్టిన ఘటనలో గ్రామానికి చెందిన 11 మంది మృత్యువాత పడ్డారు.  

స్వల్ప గాయాలతో బయట పడ్డాను
అప్పట్లో నా వయస్సు 8 ఏళ్లు. తుఫాను సమయంలో మా అమ్మతో కలిసి ప్రార్థనా మందిరంలోకి వెళ్లాం. ఆ సమయంలో చర్చి కూలుతుండగా మా అమ్మ చాకచక్యంగా మమ్మల్ని కాపాడింది. స్వల్ప గాయాలతో బయటపడ్డాం. అయితే ఏడేళ్ల క్రితం జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో మా అమ్మ చనిపోయింది.            –పల్లెకోన సుబ్బారావు, స్థానికుడు

ఘటన దురదృష్టకరం
1977, నవంబర్‌ 19న తుఫాను సమయంలో ప్రార్థనా మందిరంలో కూలడం చాలా దురదృష్టకరం.ఆ తర్వాత ఏడేళ్ల క్రితం అదే రీతిలో ట్రాక్టర్‌ ప్రమాదం జరిగి ఎక్కువ మంది చనిపోవడం తీరని లోటు .ప్రతి ఏడాది వారి జ్ఞాపకార్థంగా 19 నవంబర్‌ రోజున స్థూపం వద్ద ప్రార్థన చేసి వారిని స్మరించుకుంటాం.                  – ప్రభుదాసు, స్థానికుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top