245వ రోజు పాదయాత్ర డైరీ | 245th day padayatra diary | Sakshi
Sakshi News home page

245వ రోజు పాదయాత్ర డైరీ

Aug 26 2018 3:00 AM | Updated on Aug 26 2018 7:23 AM

245th day padayatra diary - Sakshi

25–08–2018, శనివారం  
ధారభోగాపురం, విశాఖపట్నం జిల్లా

ఎన్నికలప్పుడే ప్రేమను నటించే చంద్రబాబు నైజాన్ని ఉద్యోగులు అర్థం చేసుకున్నారు
దిమిలి గ్రామానికి చెందిన ఓ విశ్రాంత అధ్యాపకుడు చెప్పిన దయనీయ గాథ.. నన్ను కదిలించింది. జీవితాంతం ప్రభుత్వోద్యోగిగా పనిచేసిన ఆ మాస్టారికి నోటి క్యాన్సర్‌ వచ్చింది. రిటైర్‌ అయిన సమయంలో వచ్చిన కాస్తో కూస్తో ఎప్పుడో ఖర్చయిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోతే.. అప్పు చేసి విశాఖలో వైద్యమైతే చేయించుకున్నాడు. రూ.98 వేల మొత్తాన్ని నిబంధనల ప్రకారం ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాలి. అలా తిరిగి వస్తుందన్న ఆశతో అధికారులను ఆశ్రయించాడు. మెడికల్‌ బిల్లులన్నీ విధిగా సమర్పించాడు. ఏళ్లు గడుస్తున్నా ఆలకించిన నాథుడే లేడని నా వద్ద బావురుమన్నాడు. అనకాపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునూ కలిశాడట. తన గోడు వెళ్లబోసుకున్నాడట. ‘అధికారులకు చెబుతానంటూ ఆ క్షణం అరచేతిలో స్వర్గం చూపించాడయ్యా.. రెండేళ్లయినా ఇంతవరకూ ఏమీ రాలేదు.

ఎంతో మందికి పాఠాలు చెప్పిన నేను.. చంద్రబాబును వేడుకోవడం తప్పేనన్న గుణపాఠం నేర్చుకున్నా’అని చెప్పాడు. ‘ఓపికంతా కూడదీసుకుని లోకాయుక్తలో ధర్మయుద్ధం చేస్తున్నానయ్యా.. నువ్వొస్తేనే న్యాయం జరుగుతుందని ఒకే ఒక ఆశ ’అన్నాడు. చంద్రబాబుది ఎంత నిర్దయ! ప్రభుత్వోద్యోగులంటే ఎంత చులకన! ఇదెక్కడి న్యాయం? అత్యవసరం లేకున్నా.. అపాయకరం కాకున్నా.. ఆర్థికమంత్రి పంటి నొప్పికి సింగపూర్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటే రూ.2,88,823ను ఆగమేఘాల మీద రీయింబర్స్‌ చేశారే! చితికిపోయిన ఓ విశ్రాంత ప్రభుత్వోద్యోగి ప్రాణాంతకమైన క్యాన్సర్‌తో బతుకు పోరాటం చేస్తుంటే.. న్యాయంగా రావాల్సిన బిల్లులు కూడా ఇవ్వరా? చీమకుట్టినా.. తన వాళ్లకైతే సింగపూర్‌ వైద్యం కావాలా? ప్రభుత్వానికి జీవితాన్నే ధారపోసిన ఉద్యోగులను మాత్రం చీమలతో సమానంగా చూస్తారా? ఎన్నికలప్పుడే ప్రేమను నటించే చంద్రబాబు నైజాన్ని ఉద్యోగులు అర్థం చేసుకున్నారు. గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.  

దిమిలి, పల్లపునాటి గ్రామాల రైతులు బాబుగారి నయవంచనను నా దృష్టికి తెచ్చారు. ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన రుణమాఫీ హామీతో నిండా మునిగిపోయామన్నారు. వడ్డీ మీద వడ్డీలేసి బ్యాంకువారు నోటీసులు పంపుతున్నారని లబోదిబోమన్నారు. మా బతుకులు ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం రుణమాఫీ పూర్తయిందని, మేమంతా సంతోషంగా గంతులేస్తున్నామని చెబుతున్నాడని తెలిపారు. ‘మీరు రుణాలు కట్టొద్దు.. తాకట్టు పెట్టుకున్న మీ దస్తావేజుల్ని, పుస్తెల తాడులను మీ ఇంటికే తెచ్చిస్తాను’అని చెప్పిన బాబుగారి మాటలు నమ్మి రెన్యువల్‌ చేసుకోకపోవడం వల్ల అటు రుణమాఫీ జరగలేదు సరికదా.. హుద్‌హుద్‌ తుపాను తర్వాత మాకు రావాల్సిన ఇన్సూరెన్స్‌ పరిహారాన్ని సైతం కోల్పోయాం.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గద్దెనెక్కడం కోసం ఉద్దేశపూర్వకంగానే మోసం చేసిన బాబుగారు.. ఈ రైతన్నల కన్నీటినెందుకు ఖాతరు చేస్తారు! 

రాంబిల్లి, ఎస్‌ రాయవరం మండలాల నేవల్‌ బేస్‌ నిర్వాసిత మత్స్యకార సోదరులు కలిశారు. ఒప్పందం ప్రకారం అమలు చేస్తామన్న హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. సమీపంలోని సముద్రంలోనూ చేపల వేటకు వెళ్లనివ్వడం లేదన్నారు. ఆసరా లేదన్నా.. ఆశ్రయం కరువైందన్నా.. కనుచూపు మేరలో ఉపాధి కన్పించడం లేదన్నా.. అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో కాపురం చేసిన బాబుగారు.. ఆ మత్స్యకార సోదరుల సమస్యను ఏనాడూ పట్టించుకోకపోవడం దారుణం. స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా భావించే ఆ వ్యక్తి.. వీళ్లకు న్యాయం చేస్తాడనేది కలే.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. దేశంలో ఎక్కడా చేయని విధంగా రుణమాఫీ అద్భుతంగా చేసేశానని.. రైతన్నలందరూ సంతోషంగా ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే.. గ్రామగ్రామానా రైతన్నలు రుణమాఫీ కాలేదని ఎందుకు మొరపెట్టుకుంటారు? వారి రుణభారం మరింతగా ఎందుకు పెరిగిపోయింది? బ్యాంకు మెట్లు ఎక్కలేని దుస్థితి రైతన్నలకు ఎందుకు ఏర్పడింది? మీ మోసపు మాటలు నమ్మి క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కూడా కోల్పోయామంటున్న రైతన్నలకు ఏం సమాధానం చెబుతారు?
 -వైఎస్‌ జగన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement