240వ రోజు పాదయాత్ర డైరీ

240th day padayatra diary - Sakshi

19–08–2018, ఆదివారం
కెన్విన్‌ స్కూల్‌ ప్రాంతం, విశాఖపట్నం జిల్లా

ఆ అవ్వాతాతల్ని చూసి గుండె బరువెక్కింది..
మేఘావృతమైన వాతావరణంలోనే ఈ రోజు పాదయాత్ర సాగింది. క్షణక్షణానికి కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. వర్షం పడే సూచనలు కనిపించాయి. అయినా దారి పొడవునా జనం బారులు తీరారు. వాళ్లకు ఇబ్బంది కలగకూడదని.. వర్షం రాక మునుపే వీలైనంత ఎక్కువ పూర్తిచేయాలని.. ఏకబిగిన పాదయాత్ర చేశాను. 

అభిమానం, ఆప్యాయత ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తే.. విలువకట్టలేని ఆనందాన్ని నేనీ రోజు చవిచూశాను. తమ్మయ్యపాలేనికి చెందిన అనిత, అనంతలక్ష్మి, మంగ, అశ్విని అనే చిట్టి చెల్లెళ్లు ‘జై జగనన్న’ అనే పదంలోని ఒక్కో అక్షరాన్ని ఒక్కొక్కళ్లు తమ అరచేతుల్లో గోరింటాకుతో పెట్టుకున్నారు. పండిన గోరింటాకు చేతులను ఏకం చేసి నాకు స్వాగతం పలికారు.. ముచ్చటేసింది. గుండెల్లోంచి పొంగుకొచ్చే ఆ ఆప్యాయత చూసి ఆనందపడ్డాను. 

చదువే లోకమైనా.. ఉన్నత శిఖరాలే లక్ష్యమైనా.. ఆర్థిక వెనుకబాటు అడ్డంకిగా మారిందంటూ.. అనేక మంది ఈ రోజు పాదయాత్రలో ఆవేదన వ్యక్తం చేశారు. పెదబొడ్డేపల్లి వద్ద కోలా లక్ష్మి కలిసింది. భర్త ఆదరణ లేని ఆమెకో కూతురు. పదో తరగతిలో ఆ చిన్నారి మంచి ప్రతిభ చూపిందట. ఆ బిడ్డకు ఇప్పుడు ఉన్నత విద్య భారమైంది. చెయ్యి విరిగిన లక్ష్మి.. ఆరోగ్యం సహకరించని స్థితిలో భారీ ఫీజులు కట్టి ఇంటర్‌ ఎలా చదివించాలంటూ దీనంగా ప్రశ్నించింది. చంద్రయ్యపాలెం వద్ద లక్ష్మీమంగ నోటి నుంచీ ఇదే దయనీయ గాథ విన్నాను. ఏడాది కిందట భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త బతికున్నప్పుడు కూలికెళ్లి పిల్లలను చదివించుకున్నారట.

ఇప్పుడు ఆమె ఒక్కతే. పూట గడవడమే కష్టంగా ఉంటే.. వాళ్లనెలా చదివించను?.. అంటూ బావురుమంది. ఇలాంటిదే మరోటి.. సుబ్బరాయుడుపాలెం దగ్గర చుక్కా లక్ష్మి కలిసింది. పుట్టు వైకల్యంతో ఉన్న తొమ్మిదేళ్ల బిడ్డను చూపిస్తూ కన్నీటి కథ వినిపించింది. బిడ్డకు వైద్యం చేయించి చదివించాలనుకుందట. వైద్యానికి లక్షలు ఖర్చవుతుందట. రెక్కాడితేగానీ డొక్కాడని నేనెక్కడి నుంచి తేవాలి? ఈ బిడ్డను ఎలా చదివించాలి?.. అంటూ ప్రశ్నించింది. అంత తేలికగా సమాధానం చెప్పలేని హృదయ ఘోష ఇది. ఊరూరా ఇలాంటి కన్నీటి గాథలెన్నో నా దృష్టికొస్తూనే ఉన్నాయి. చదువుకు ఆర్థిక స్తోమత అడ్డంకి కాకూడదన్నదే నా కల. అమ్మ ఒడి పథకం ద్వారా ఇటువంటి తల్లులకు అండగా నిలవాలన్న నా సంకల్పం మరింత బలపడింది. 

సుబ్బరాయుడుపాలేనికి చెందిన కామిరెడ్డి లచ్చమ్మ, ఎర్రయ్య దంపతుల దయనీయ పరిస్థితిని చూసి ద్రవించని హృదయం అంటూ ఉండదేమో. ఇద్దరికీ 80 ఏళ్ల పైచిలుకు వయసే. ఓ పాడుపడ్డ పెంకుటింట్లో తలదాచుకుంటున్నారు. ఆ తాతకు నడవడమూ కష్టమే. మతి కూడా స్థిమితంగా ఉండదు. ఆ అవ్వకు గతేడాది చెయ్యి విరిగింది. ఏ పనీ చేసుకోలేరు. ఇద్దరి కంటిచూపు అంతంతమాత్రమే. ఉన్న ఒక్కగానొక్క కొడుకూ అనారోగ్యంతో చనిపోయాడు. ‘నా’ అన్నవాళ్లెవరూ లేరు. ఇరుగుపొరుగు వారి దయతో అతికష్టం మీద బతుకులీడుస్తున్నారు. ఆ వయసులో ఆ పండుటాకులకు ఎంత కష్టం? కంటతడి పెట్టిన ఆ అవ్వాతాతల్ని చూసి గుండె బరువెక్కింది.. కళ్లు చెమర్చాయి. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలంటూ కొన్ని హామీలను ముద్రించారు. అందులో ఒకటి.. ‘ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు’. ఆ హామీ కనీసం గుర్తయినా ఉందా? వందలు, వేల కథ దేవుడెరుగు.. కనీసం రాష్ట్రం మొత్తానికి ఒక్కటంటే ఒక్క వృద్ధాశ్రమమైనా కట్టారా? మీ వంచనలో వృద్ధులకైనా మినహాయింపు లేదా? 
-వైఎస్‌ జగన్‌    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top