రాష్ట్ర విభజనను తట్టుకోలేక శుక్రవారం మరో 14మంది తనువు చాలించారు. గుంటూరు జిల్లా మాచర్లలో కూలి పనిచేసుకునే సంసోన్ (37) టీవీలో వార్తలు చూస్తూ రాష్ట్రం విడిపోతుందేమోనన్న మనస్తాపంతో తీవ్రంగా కలత చెంది గుండెపోటుతో కన్నుమూశాడు.
న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : రాష్ట్ర విభజనను తట్టుకోలేక శుక్రవారం మరో 14మంది తనువు చాలించారు. గుంటూరు జిల్లా మాచర్లలో కూలి పనిచేసుకునే సంసోన్ (37) టీవీలో వార్తలు చూస్తూ రాష్ట్రం విడిపోతుందేమోనన్న మనస్తాపంతో తీవ్రంగా కలత చెంది గుండెపోటుతో కన్నుమూశాడు. ఇదే జిల్లా చేబ్రోలుకు చెందిన ఎన్.కృష్ణ(40) కూడా విభజన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన తవిటిక శ్రీను (43) విభజన నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి మనోవ్యధకు గురయ్యాడు. కూలిపనులకు స్వస్తిపలికి ఉద్యమంలో పాల్గొంటున్న శ్రీను నీరసంతో శుక్రవారం ఉదయం నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. అలాగే, కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లికి చెందిన పెద్దిరెడ్డి శ్రీనివాస్ (28) వారం రోజులుగా టీవీలో సమైక్యాంధ్ర వార్తలు గమనిస్తూ శుక్రవారం మధ్యాహ్నం మనోవ్యధతో ప్రాణాలు విడిచాడు.
తొండంగి మండలం శృంగవృక్షం ఎస్సీ కాలనీలో శుక్రవారం పులుగు సింహాచలం(32) సమైక్యాంధ్ర ఉద్యమంపై చర్చించుకుంటుండగా ఉద్వేగానికి గురై కుప్పకూలి మరణించాడు. అమలాపురం నారాయణపేట ప్రభాకరనగర్‌కు చెందిన అడ్డాల రామారావు(65) ఐదు రోజులు గా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలకు చెందిన తోట విజయకుమార్ (28) విభజన నిర్ణయంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం మరో నలుగురు గుండె ఆగి మరణించారు. విభజన ప్రకటన నేపథ్యంలో వారం రోజుల నుంచి మనస్తాపంతో ఉన్న ఉండి గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ కంట్రోలర్ పువ్వల రామారావు (70) శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో వామిశెట్టి లక్ష్మీనరసమ్మ (60) టీవీలో రాష్ట్ర విభజన వార్తలు చూస్తూ గుండె ఆగి ప్రాణాలు వదిలింది. తాడేపల్లిగూడెంకు చెందిన రిక్షా కార్మికుడు సప్పా దేవుడు (33), నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన బోడిగట్ట వెంకటలక్ష్మి (20) గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలారు. చిత్తూరు జిల్లా కలికిరి పట్ణణం కే రెడ్డివారిపల్లి పంచాయతీ పొట్టేకులవారిపల్లెకు చెందిన ఆవుల వెంకటేష్(58) రెండ్రోజుల క్రితం పిల్లల వద్దకు హైదరాబాద్ వెళ్లి విభజన వార్తలతో ఆందోళనకు గురయ్యాడు.
తెలంగాణ నుంచి వారు వెళ్లిపోవాల్సి వస్తుందేమోనన్న ఆవేదనతో తిరుగు ప్రయాణమవుతూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గుండెపోటుతో మరణించాడు. విశాఖ జిల్లా మధురవాడలోని రేవలపాలెం గ్రామానికి చెందిన ఆడాడ కృష్ణ (65) రాష్ట్రం విడిపోతున్నదని తెలిసిన దగ్గర నుండి తీవ్ర నిరుత్సాహం చెంది ప్రాణాలు వదిలాడు. రాష్ట్రం విడిపోతే సాగునీరు రాదనే వేదనతో ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం తిమ్మసముద్రం ఎస్‌సీ కాలనీకి చెందిన కౌలు రైతు కంచర్ల ఆదాం (41) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశాడు.


