ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల కోసం రూ. 12 వేల కోట్లు

12 thousand crores For facilities in government hospitals - Sakshi

ప్రతి మండలానికి 104, 108 వాహనాలు 

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడి

సాక్షి, కాకినాడ: ప్రతి పేదకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.12 వేల కోట్లు కేటాయించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. శుక్రవారం కాకినాడలోని జెడ్పీ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపచేసేందుకు వీలుగా హెల్త్‌ కార్డులు అందిస్తున్నామన్నారు. దీనిని వచ్చే ఏడాది జనవరి 1న పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. ఏవైనా లోపాలుంటే గుర్తించిన అనంతరం అన్ని జిల్లాల్లోనూ హెల్త్‌ కార్డులు ఇస్తామన్నారు.

రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక 108, ఒక 104 వాహనం చొప్పున అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. సెప్టెంబర్‌ నాటికి 676 కొత్తగా 108 వాహనాలను, 773 కొత్త 104 వాహనాలను కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. కండిషన్‌లో లేని వాహనాలను పూర్తిగా తొలగిస్తామన్నారు. మరో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ జిల్లాలో డయాలసిస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోందని, ఇప్పటికే 32 మంది డయాలసిస్‌ బాధితులు ఉన్నట్టు అధికారులు గుర్తించారని చెప్పారు. వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్ల వాపు వ్యాధితో అనేక మంది గిరిజనులు మరణిస్తున్నారన్నారు.

ఆ వ్యాధి ఎందుకు వస్తున్నదో గుర్తించేందుకు ఓ కమిటీ వేసి నిర్ధారించాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ అమలాపురం ఏరియా ఆస్పత్రికి 10 మంది నర్సులను, డాక్టర్లను నియమించాలని కోరారు. రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన బిడ్డ బతుకుతుందో లేదోనన్న ఆందోళనలో గర్భిణులు ఉన్నారని కన్నీరు పెట్టుకున్నారు. కాళ్ల వాపు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కింద చెన్నై, బెంగళూరు, ముంబయ్‌ తదితర ప్రాంతాల్లోని 150 సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రుల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top