రేపట్నుంచి టెన్త్ పరీక్షలు

రేపట్నుంచి టెన్త్ పరీక్షలు


మే మూడో వారంలో ఫలితాలు



సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి.మన్మథరెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా పరీక్షలు నిర్వహిస్తామని మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్లనూ అనుమతించబోమని చెప్పారు. హాల్ టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించామన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లు పోగొట్టుకున్నా, పాఠశాల యాజమాన్యాలు ఇవ్వకపోయినా ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ  వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను కూడా అనుమతించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. వచ్చే నెల 15 నుంచి 30వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని తెలిపారు. మే మూడో వారంలో (20వ తేదీకి ఒకట్రెండు రోజులు అటూఇటూగా) ఫలితాలు వెల్లడిస్తామన్నారు. టెన్త్ పరీక్షలకు సంబంధించి ఆయన వెల్లడించిన ముఖ్యాంశాలు ఇవీ..



 గురువారం నుంచి వచ్చే నెల 15 వరకు ఉదయం 9.30 నుంచి 12.00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 21,076 పాఠశాలల నుంచి 12,26,460 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 5,658 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి.

కాపీయింగ్ నిరోధానికి 300 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.

 విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గత ఏడాది కేవలం పరీక్ష విధుల నుంచి తప్పించడానికే పరిమితం చేశాం. ఈ ఏడాది క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.

 పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో హామీ  ఇచ్చింది.ఙ- విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి తగినన్ని బస్సులు నడుపుతామని ఆర్టీసీ చెప్పింది.

 ఎండ తీవ్రత ఎక్కువున్నందున, ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ‘నాన్ మెడికల్ అసిస్టెంట్’ను ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కోరాం.

- జవాబు పత్రాలను సంబంధిత మూల్యాంకన కేంద్రాలకు జాగ్రత్తగా పంపడానికి చర్యలు చేపట్టాలని పోస్టల్ శాఖకు సూచించాం.

పరీక్షల డెరైక్టర్ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నాం. 040-23237343 నంబర్‌కు పోన్ ద్వారా, 040-23237344 నంబర్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు par చేయవచ్చు.

 అంధ, మూగ, చెవిటి, అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు పాస్ మార్కులు 20కి పరిమితం చేయడంతో పాటు అరగంట సమయం అదనంగా ఇస్తారు. డిస్లెక్సియాతో బాధపడే విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్ పేపర్ రాయాల్సిన అవసరంలేదు. వీరికి గంట సమయం అదనంగా ఇస్తారు. అందరికీ స్క్రైబ్ సౌకర్యం కల్పిస్తారు.



విద్యార్థులకు సూచనలు



 తొలి రోజు, రెండో రోజు అర గంట ఆలస్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులను అనుమతిస్తారు. తర్వాత కూడా ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతిస్తారు. అయితే ఒకే పాఠశాల విద్యార్థులు ఆలస్యంగా వస్తే.. వారిని అనుమతించరు.

పరీక్షలకు ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులకే నష్టం. అందుకే ముందు రోజే పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలి.

 విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

పరీక్షకు రైటింగ్ ప్యాడ్స్ తీసుకెళ్లాలి. సరిపడా పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేలు తీసుకెళ్లాలి.

 ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్‌తో జత పరిచి ఇచ్చిన ఓఎంఆర్ షీట్ తమదే అని ధృవీకరించుకోవాలి. దానిపై ఉన్న హాల్ టికెట్ నంబర్‌ను విద్యార్థి వద్ద ఉన్న హాల్ టికెట్ నంబర్‌తో సరిచూసుకోవాలి. తర్వాతే పరీక్ష రాయడం మొదలుపెట్టాలి. ఓఎంఆర్ షీట్ తమది కాదని భావిస్తే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఆలస్యంగా ఫీజు కట్టిన విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ మీద హాల్ టికెట్ నంబర్ ఉండదు. అలాంటి వారు నంబర్ రాయడానికి ఓఎంఆర్ షీట్‌లో ఖాళీ స్థలం ఉంటుంది.


అడిషనల్ ఆన్సర్ షీట్లు, గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్‌ను మెయిన్ ఆన్సర్ షీట్‌కు జత చేసి దారంతో గట్టిగా కట్టాలి. మెయిన్ ఆన్సర్ షీట్ మీద ఉన్న సీరియల్ నంబర్‌ను అడిషనల్ షీట్లు, మ్యాప్, బిట్ పేపర్‌పై మరిచిపోకుండా రాయాలి.

సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లో అనుమతించరు.

హాల్ టికెట్ తప్ప మరే ఇతర కాగితాలను విద్యార్థులు వెంట తీసుకెళ్లకూడదు. హాల్‌టికెట్ నంబర్‌ను మెయిన్ ఆన్షర్‌షీట్, అడిషనల్ షీట్, బిట్ పేపర్, మ్యాప్, గ్రాఫ్.. ఇలా ఎక్కడా రాయకూడదు. పేరు, సంతకం, ఇతర చిహ్నాలు, స్లోగన్స్ వంటివి ఆన్సర్ షీట్లో రాయకూడదు.



 అవిభాజ్య రాష్ట్రంలో ఇవే ఆఖరి పరీక్షలు



అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతికి ఇవే ఆఖరు పరీక్షలు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలను తమిళం, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మరాఠీ, ఒరియా, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది తెలంగాణలో తమిళ, ఒరియా మీడియం పరీక్షలు ఉండవు. తమిళ మీడియం విద్యార్థులు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనే ఉన్నారు. ఒరియా విద్యార్థులు శ్రీకాకుళంలోనే ఉన్నారు. మరాఠీ విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లాకే పరిమితమైనందున, కొత్త ఆంధ్రప్రదేశ్‌లో మరాఠీ మీడియంలో పరీక్షలు ఉండవు. హిందీ మీడియం విద్యార్థులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉండే అవకాశం లేదు. తమిళ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒరియా మీడియం విద్యార్థులందరూ కలిపినా 3,815 మందే ఉన్నారు. ఉర్దూ మీడియంలో 17,754 మంది పరీక్షలకు హాజరవుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top