సంజీవనికి చంద్రగ్రహణం..

108 Neglected By Tdp Government - Sakshi

సాక్షి, మండపేట: 2018 అక్టోబరు 23.. అప్పటి వరకు కాకినాడలోని బంధువుల ఇంట జరిగిన వేడుకలో అందరితో ఆనందంగా గడిపారు. వెళ్లివస్తామంటూ విశాఖ జిల్లాలోని తమ స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు. చేబ్రోలు సమీపంలో రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు, పోలీసులు 108కి సమాచారం అందించారు. ఎంతసేపటికీ రాకపోవడంతో పోలీసులు ఆటోలో క్షతగ్రాతులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఈలోగా మరో ఇరువురు మృత్యు ఒడికి చేరుకున్నారు. 

నాలుగు నెలల క్రితం కత్తిపూడి సమీపంలో మతిస్థిమితం లేని మహిళ శిశువుకు జన్మనిచ్చింది. వైద్యసాయం కోసం స్థానికులు 108 సమాచారం ఇచ్చారు. మూడు గంటల తర్వాత 108 అంబులెన్స్‌ అక్కడకు చేరుకుంది. శిశువుకు సకాలంలో వైద్యం అందక జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

ఆరు నెలల క్రితం మండపేట రూరల్‌ ఏడిదకు చెందిన ఇరువురు రాజమహేంద్రవరం నుంచి మోటారు సైకిల్‌పై గ్రామానికి తిరిగి వస్తుండగా చింతాలమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా మట్టిలోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్‌ తలకు తీవ్రగాయమై రోడ్డుపై పడిపోగా, వెంకటరమణ పక్కనే ఉన్న పంట బోదెలో పడిపోయాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేసినా ఎంతసేపటికీ వాహనం రాకపోవడంతో ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చేసరికి దుర్గాప్రసాద్‌ చనిపోగా, కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వెంకటరమణ మృతిచెందాడు. 

ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రాణదాత సేవలు నిర్వీర్యమవుతున్న వేళ సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కో కొల్లలు. ఆపదలో మృత్యువుతో పోరాడుతున్న వేళ.. ఫోన్‌ చేసిన 15 నిమిషాలకే కుయ్‌.. కుయ్‌.. మంటూ చెంతకు వచ్చి ప్రాణాలు నిలిపే అపర సంజీవనికి చంద్ర గ్రహణం పట్టింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు సామగ్రి లేక సతమతమవుతోంది. సర్కారు నిర్లక్ష్యంతో మరమ్మతులకు గురైన వాహనాలను పట్టించుకునే వారు లేక సైరన్‌ మూగపోతోంది. 

జిల్లాలో 42 వాహనాలకు అధికారిక లెక్కల ప్రకారం 39 తిరుగుతున్నాయి. కాగా మరమ్మతులతో రామచంద్రపురం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 13 వాహనాలు నాలుగు నెలల నుంచి ఏడాది కాలంగా షెడ్లలోనే ఉండగా, 29 వాహనాలు మాత్రమే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. వీటిలో అధికశాతం వాహనాలు స్వల్ప మరమ్మతులతోనే నడుస్తున్నాయి. ఇంజిన్‌లో ఆయిల్‌ మార్చకపోవడం, టైర్లు అరిగిపోవడం తదితర సమస్యలు అపర సంజీవని లక్ష్యానికి ప్రతిబంధకంగా తయారయ్యాయి.

సాధారణంగా రెండు లక్షల కిలోమీటర్లు తిరిగిన అంబులెన్స్‌లను మార్చివేయాల్సి ఉంది. కాగా జిల్లాలో అధికశాతం వాహనాలు నాలుగు నుంచి ఐదు లక్షల కిలోమీటర్లు వరకు తిరిగినవి కావడం గమనార్హం. అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో వాహనాలు మొరాయించి ఆలస్యమవుతుండడంతో జరగాల్సిన ప్రాణనష్టం జరిగిపోతోంది. ఫిట్‌నెస్‌ లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల ఆరు కొత్త వాహనాలు ఇచ్చినట్టు చెబుతుండగా పాత వాహనాలకు మరమ్మతులు చేయించకపోవడం విమర్శలకు తావిస్తోంది.  

జిల్లాలో 108 దుస్థితి ఇదీ..

జిల్లాలో మొత్తం వాహనాలు                                                        42
ప్రస్తుతం తిరుగుతున్న వాహనాలు                                               29
మరమ్మతులతో మూలకు చేరినవి                                               13
స్వల్ప లోపాలతో తిరుగుతున్న వాహనాలు                                    24
ఎక్కువ లోపాలున్నా తిరుగుతున్నవి                                             2
ఆక్సిజన్‌ అందుబాటులో లేని వాహనాలు                                       24
ఇంజిన్‌ ఆయిల్‌ కూడా మార్చకుండా తిప్పుతున్న వాహనాలు            20
టైర్లు అరిగిపోయినా తిరుగుతున్న వాహనాలు                                 20

సకాలంలో వచ్చి ఉంటే ప్రాణాలు నిలిచేవి 
కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆటోను గొల్లప్రోలు సమీపంలో లారీ ఢీకొట్టినప్పుడు సాయం కోసం 108కు సమాచారం అందించాం. ఎంతసేపటికీ రాకపోవడంతో పోలీసులు, స్థానికులు ఆటోల్లో తరలించే ఏర్పాటుచేశాం. సకాలంలో 108 రాకపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సకాలంలో వచ్చి ఉంటే రెండు ప్రాణాలు నిలిచేవి. వాహనం వచ్చే సరికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. 
– ఎల్‌.అప్పన్నదొర, గొల్లప్రోలు

చూద్దామంటే కనిపించడం లేదు
దివంగత వైఎస్‌ 108 పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేశారు. కుయ్‌ కుయ్‌ కుయ్‌మన్న హారన్‌ వినిపిస్తే వైఎస్సార్‌ గుర్తొచ్చేటంతగా ఈ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. లక్షలాది మందికి పునర్జీవితాన్ని ఇచ్చింది. అటువంటి 108 ఇప్పుడు చూద్దామంటే కనిపించడం లేదు. 
– దుగ్గిరాల రాంబాబు, మండపేట

ప్రథమ చికిత్స అందడం లేదు
దారిన వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే 108కి సమాచారమిచ్చేవాళ్లం. వెంటనే 108 సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స చేసేవారు. దీనివల్ల ఆపదలో ఉన్నవారి ప్రాణాలు నిలిపేందుకు ఆస్కారముండేది. ఇప్పుడు ఫోన్‌చేసినా వాహనాలు రావడం లేదు. ఆటోల్లో తరలిస్తే ప్రథమ చికిత్స అందడం లేదు. 
– గొర్రెల శ్రీనివాసరావు, కరప

ఫోన్‌ చేసిన పావు గంటలో వచ్చేది
గతంలో ఫోన్‌ చేసిన పావుగంటలో 108 వాహనాలు సంఘటన స్థలానికి వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంబులెన్స్‌ వస్తుందో లేదో తెలీని దుస్థితి. వేరే కేసులో ఉన్నామనో? దూరంగా ఉన్నామనో సమాధానం చెబుతున్నారు. దీంతో గాయపడిన వారిని ఆటోల్లో తరలించాల్సి వస్తోంది. 
– గుబ్బల శ్రీనివాస్, న్యాయవాది, రామచంద్రపురం
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top