చౌక వద్దు.. వృథాయే ముద్దు

Govt green signal to the 41 PPAs without the need - Sakshi

     పవన విద్యుత్‌ మూల్యం రూ.11,625 కోట్లు

     అవసరం లేకున్నా 41 పీపీఏలకు సర్కారు పచ్చజెండా

     కొరత లేదు.. డిమాండ్‌ లేదు అయినా కొనుగోళ్లు

     మార్చిలో వద్దన్న నిపుణులు 

     ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో ఆమోదం

     25 ఏళ్లపాటు అమల్లో ఉండే పీపీఏలు

     గుజరాత్‌లోయూనిట్‌ ధర రూ.2.43

     రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధర రూ. 4.84

     యూనిట్‌కు అదనంగా చెల్లిస్తోంది రూ. 2.41

      840 మెగావాట్ల కొనుగోలుకు అదనంగా చెల్లిస్తున్న మొత్తం  రూ. 11,625 కోట్లు

సాక్షి, అమరావతి: అవసరం లేకపోయినా మార్కెట్‌కి వెళ్లి ఏమన్నా కొనుక్కొచ్చేస్తామా? అదీ పక్క షాపులో తక్కువకే దొరుకుతున్నా రెట్టింపు కన్నా ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేస్తామా? అసలు అలా కొనుక్కురావద్దని కుటుంబంలో తీర్మానించుకున్నాక కూడా కొంటున్నామంటే అర్ధమేమిటి? ఏదో మతలబు ఉందనేగా అర్ధం.. ఇలా చేస్తే మనలని ఏమంటారు. అదే ఒక రాష్ట్రప్రభుత్వం వేల కోట్లరూపాయల విలువ చేసే వ్యవహారాలను ఇలా నడుపుతున్నదనుకోండి దానినేమంటారు? 

పవనవిద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో రాష్ట్రప్రభుత్వ తీరు చూసిన వారు నివ్వెరపోతున్నారు.  నష్టదాయకం కాబట్టి పవన ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు’ వద్దని విద్యుత్‌ నిపుణులు ప్రభుత్వానికి 03.03.2017న లిఖితపూర్వకంగా  నివేదించారు. అప్పటికి రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది.  కానీ అది తాత్కాలికమేనని తర్వాత తెలిసింది. అంతా సద్దుమణిగాక పవన విద్యుత్‌ పీపీఏలకు రాష్ట్రప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. అదీ రెట్టింపుకన్నా అధికధరకు కొనుగోలు చేసేందుకు. గుజరాత్‌లో తక్కువకే పవనవిద్యుత్‌ దొరుకుతున్నా ఇలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పీపీఏలు ఎందుకు కుదుర్చుకున్నారు? పోనీ రాష్ట్రంలో ఏమన్నా విద్యుత్‌ కొరత ఉందా అంటే లేదు. సమీప భవిష్యత్‌లో కొరత వచ్చే సూచనలూ లేవు. అయినా ఈ అడ్డగోలు కొనుగోలు ఒప్పందాల వెనక ఉన్న మతలబేమిటి? 

41 పీపీఏలకు ఆమోదం..
విద్యుత్‌ రంగ నిపుణులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) 41 పీపీఏలకు అనుమతిం చింది. రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్‌ ఏమాత్రం పెరగలేదు. కొరతనేదే లేదు. అయినా అధిక ధర చెల్లించి ప్రైవేట్‌గా ఇలా పవన విద్యుత్‌ కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధం కావటంపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దీనివల్ల పెద్దఎత్తున భారం పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేసిన ఇంధన శాఖ మనసు మార్చుకుని కొనుగోలుకు పచ్చజెండా ఊపడం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని వినిపిస్తోంది. ఇలాంటి నష్టదాయకమైన పీపీఏల ఫలితంగా థర్మల్‌ విద్యుత్‌ యూనిట్ల ఉత్పత్తి వ్యయంతోపాటు అప్పులు కూడా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పొరుగున ఉన్న కర్నాటక సహా అనేక రాష్ట్రాలు ఇలాంటి నష్టదాయకమైన పీపీఏలకు దూరంగా ఉంటున్నాయి. చౌకగా లభించే చోటే విద్యుత్‌ కొనుగోలు  చేస్తున్నాయి. 

యూనిట్‌ రూ.2.43కే అందుబాటులో ఉన్నా...
మన రాష్ట్రంలో పవన విద్యుత్‌  ఏడాదికి 6 వేల మిలియన్‌ యూనిట్లకుపైగా ఉత్పత్తి అవుతోంది. వాస్తవానికి 2014 తర్వాత పవన విద్యుత్‌ ఉత్పత్తిలో పోటీ వచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో పవన విద్యుత్‌ ధరలు తగ్గుతున్నాయి. గుజరాత్‌లో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) ఇటీవల ఓపెన్‌ బిడ్డింగ్‌కి పిలవగా పవన విద్యుత్‌ యూనిట్‌ రూ. 2.43 చొప్పున 500 మెగావాట్లను సరఫరా చేస్తామని ఉత్పత్తిదారులు ముందుకొచ్చారు. స్ప్రింగ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, కేపీ ఎనర్జీ లిమిటెడ్‌ రూ. 2.43 కే సరఫరా చేస్తామని ముందుకొచ్చాయి.  అంటే ఆ రేటుకు కొనుగోలు చేసేందుకు మనకూ అవకాశం ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూనిట్‌ రూ. 4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు తాజా పీపీఏలలో సిద్ధపడింది. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.2.41 చొప్పున అధికంగా చెల్లించేందుకు రాష్ట్ర సర్కారు íసిద్ధమైందన్నమాట. 

అదనంగా దోచిపెట్టేది రూ. 11,625 కోట్లు..
ఈ పీపీఏలను 25 ఏళ్లకు కుదుర్చుకోవాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. 41 పీపీఏల ద్వారా మొత్తం 840 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తారు. ఒక్కో మెగావాట్‌కు 2.3  మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వస్తుంది. 840 మెగావాట్లకు 1,932 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను డిస్కమ్‌లకు ప్రైవేట్‌ సంస్థలు అంటగడతాయి. ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ. 2.41 చెల్లించటం ద్వారా 1,932 మిలియన్‌ యూనిట్లకు ఏటా రూ. 465 కోట్లు అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 465 కోట్లు అంటే.. 25 ఏళ్లకు  చెల్లించే అదనపు వ్యయం రూ.11,625 కోట్లు అన్నమాటేగా..

భారీగా ముట్టిన ముడుపులు?
ఎలాంటి బిడ్డింగ్‌లు లేకుండా ప్రైవేటు విద్యుత్‌ సంస్థలకు రూ. 11,625 కోట్లు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎందుకు సిద్ధమౌతోంది? దీని వెనక భారీగా ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై తొలుత అభ్యంతరాలు వ్యక్తం చేసిన రాష్ట్ర విద్యుత్‌ సమన్వయ కమిటీ ఆ తర్వాత ఆమోదం తెలపడం వెనక కూడా రాష్ట్రప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందని వినిపిస్తోంది. విద్యుత్‌ ఉత్పత్తిదారులు ముఖ్యమంత్రిని కలిసిన తరువాత ప్రైవేట్‌ పవన విద్యుత్తు కొనుగోలుకు అంగీకరించటం ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది.

అసలు అదనపు విద్యుత్‌ అవసరమేమిటి?
రాష్ట్రంలో 2017–18లో 57 వేల మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తే వాస్తవ వినియోగం 52 వేల మిలియన్‌ యూనిట్లు దాటలేదు. 2018–19పై కూడా డిస్కమ్‌లు ఇదే స్థాయిలో 61 వేల మిలియన్‌ యూనిట్ల అవసరం ఉంటుందని అతిగా అంచనా వేశాయి. అయినప్పటికీ ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు  ఏపీ జెన్‌కో థర్మల్, హైడల్‌ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 156 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటే థర్మల్‌ ద్వారా 96 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. కేంద్రం నుంచి చౌకగా మరో 48 మిలియన్‌ యూనిట్లు అందుతున్నాయి. జల విద్యుత్‌ ద్వారా 17 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. వీటి ద్వారా యూనిట్‌ విద్యుత్తు సగటున రూ. 3.50 లోపే లభిస్తుంది. డిమాండ్‌ కన్నా ఇంకా ఐదు మిలియన్‌ యూనిట్లు మిగులు ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు డిమాండ్‌ లేకుండా విద్యుత్తు కొనుగోలు చేసి ఏం చేస్తారనే ప్రశ్నకు జవాబు లేదు.

రైటప్‌లు
1.. ఏపీఈఆర్‌సీ ఉత్తర్వులో  పీపీఏలు కుదిరినట్లు తెలిపే భాగాలు.. 
2. పవన విద్యుత్‌ పీపీఏలను ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ 03.03,2017న ఏపీఈఆర్‌సీ సెక్రటరీకి ఏపీఎస్‌పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ నుంచి అందిన లేఖ.
3. పవన విద్యుత్‌ డెవలపర్లతో పీపీఏలు కుదుర్చుకోవడానికి అనుమతి కోరుతూ ఏపీఎస్‌పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ నుంచి ఏపీఈఆర్‌సీ సెక్రటరీకి అందిన లేఖ
4. గుజరాత్‌లో పవన విద్యుత్‌ ధరలు భారీగా తగ్గిపోయాయని 21.12.2017న వచ్చిన వార్తా కథనం.  

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top