
ఫలితాల్లో రోల్ మోడల్
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందన్న నానుడి నిజం చేస్తున్నారు టేక్మాల్ మోడల్ స్కూల్ విద్యార్థులు. విద్యాబోధనలో మెళకువలు పాటిస్తూ.. ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపడుతూ విద్యావ్యవస్థలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్న తలంపుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్ మంచి ఫలితాలను సాధిస్తూ శభాష్ అనిపించుకుంటుంది.
–టేక్మాల్(మెదక్)
జిల్లాలో 7 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయగా ఒక్కో పాఠశాలకు సుమారుగా 820 మంది విద్యార్థులు విద్యాబోధన చేస్తున్నారు. ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆంగ్లంలోనే విద్యా బోధన నిర్వహిస్తున్నారు. జిల్లా అన్ని ప్రభుత్వ, మోడల్ స్కూల్ కంటే టేక్మాల్‌లోని మోడల్ స్కూల్‌లో మంచి ఫలితాలను సాధిస్తూ జిల్లాలోనే టాప్‌లో నిలుస్తున్నారు.
ఉత్తమ ఫలితాల్లో ఫస్ట్..
● క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ పాఠశాలలో పదవ తరగతి ప్రారంభమైన 2016 నుంచి పదవ తరగతిలో ఈ ఏడాది వరకు 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు.
● ఈసారి పదవ తరగతిలో శ్రీజ 577 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, కార్తీక్ 572 మార్కులను సాధించి రెండో స్థానంలో నిలిచాడు. సుమారు 44 మందికి విద్యార్థులు 500లకి పైగా మార్కులు సాధించారు.
● ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 87 శాతం ఉత్తీర్ణత సాధించగా పాఠశాలకు చెందిన పూజ అనే విద్యార్థి 960 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.
● పాఠశాలలో నేషనల్ మిన్స్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు పదులకొద్ది విద్యార్థులు ఎంపికవుతున్నారు.
● ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో మోడల్ స్కూల్ అన్నింటి కంటే ఆదర్శంగా నిలుస్తోంది.
● ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో సైతం పట్టు సాధించి ఉన్నత విద్యకు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతున్నారు.
ఇంటర్‌లో దరఖాస్తుల ఆహ్వానం
● 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇంట ర్మీడియట్ ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
● ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మొత్తంగా 150 సీట్లు అందుబాటులో ఉండగా పదవ తరగతి వచ్చిన మార్కుల మెరిట్ లిస్టు ప్రకారం విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం మోడల్ స్కూల్లో ఎంపీసీ 40, బైపీసీ 40, సీఈసీ 40, ఎంఈసీ 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
● మొదటి సంవత్సరం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 20వ తేదీ వరకు గడువు కావడంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మోడల్ స్కూల్‌లో 100 మంది విద్యార్థినులకు ఉచిత వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు.
పదేళ్లుగా పదిలో 100 శాతం ఉత్తీర్ణత
ఆటల్లోనూ రాణిస్తున్న విద్యార్థులు
ఆదర్శంగా నిలుస్తున్న టేక్మాల్ మోడల్ స్కూల్
ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆంగ్లంలోనే విద్యా బోధన
20 వరకు ఇంటర్‌లో దరఖాస్తులకు అవకాశం
సమష్టి కృషితో ఫలితాలు
కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యాబోధన నిర్వహిస్తున్నాం. పదేళ్లుగా పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాం. ఇంటర్మీడియట్‌లో సైతం మంచి ఫలితాలు సాధిస్తున్నాం. పాఠశాలలోని ఉపాధ్యాయుల అందరి సమష్టి కృషితో ప్రతీ ఏడాది మంచి ఫలితాలను సాధిస్తున్నాం. చదువుతోపాటు విద్యార్థులు ఆటల్లో తమ ప్రతిభను కనబర్చి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ కార్యక్రమం నిర్వహిస్తాం.
– సుంకరి సాయిలు,
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టేక్మాల్
ఆటల్లోనూ అదుర్స్..
చదువుతోపాటూ పాఠశాలల్లోని విద్యార్థులు సాంసృతిక కార్యక్రమాల్లోనూ, ఆటల్లోనూ తమ ప్రతిభ కనభరుస్తున్నారు. మండల స్థాయిని మొదలుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. యోగాలో తమకు దీటుగా ఎవరూ లేరంటూ జాతీయ స్థాయిలో బహుమతులు పొంది అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. వసతులు అంతత మాత్రమే ఉన్నప్పటికీ క్రమశిక్షణతో కూడిన విద్యా భోదన ఉండటంతో పాఠశాలల్లో చేరేందుకు డిమాండ్ ఉంది.

ఫలితాల్లో రోల్ మోడల్

ఫలితాల్లో రోల్ మోడల్