
అనారోగ్యం తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య
హుస్నాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హనుమాన్ నగర్‌కు చెందిన గొర్ల శ్రీనివాస్ (40)కు భార్య లక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒక అమ్మాయికి వివాహం జరిగింది. శ్రీనివాస్ కొద్ది రోజులు గా కిడ్నీ వ్యాధితోపాటు అనారోగ్య సమస్యల తో బాధ పడుతున్నాడు. భార్య కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. అనారోగ్య సమస్యలతో వేగలేక మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది..
గజ్వేల్‌రూరల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గజ్వేల్ పట్టణంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. రాయపోల్ మండలం తిమ్మకపల్లికి చెందిన కామోజీ ఆంజనేయులు(45)కు నవనీతతో 14 ఏళ్ల కిందట వివాహం కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెయింటర్‌గా పని చేస్తున్న ఆంజనేయులు గజ్వేల్ పట్టణంలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడుతుండటంతో పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు 4న ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.