Andhra Pradesh Crime News: ఆర్‌టీఏ చెక్‌పోస్టులో అక్రమ వసూళ్లు
Sakshi News home page

Kurnool: ఆర్‌టీఏ చక్‌పొస్టులో యదేచ్చగా అక్రమ వసూళ్లు

Published Tue, Jan 23 2024 6:40 AM | Last Updated on Tue, Jan 23 2024 11:39 AM

- - Sakshi

ఆర్‌టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీల్లో పట్టుబడిన ఎంవీఐ సునీల్‌ కుమార్‌

కర్నూలు: పంచలింగాల వద్ద ఉన్న అంతర్‌రాష్ట్ర ఆర్‌టీఏ చెక్‌పోస్టులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తేల్చారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, కృష్ణయ్య, వంశీనాథ్‌, ఎస్‌ఐ సుబ్బరాయుడు, హెడ్‌ కానిస్టేబుల్‌ దొరబాబుతో పాటు మరో 15 మంది సిబ్బంది ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు.

అక్కడే ఉండి సోమవారం సాయంత్రం వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. విధులు నిర్వహిస్తున్న మోటర్‌ వాహనాల తనిఖీ అధికారి (ఎంవీఐ) జె.సునీల్‌కుమార్‌ వద్ద అనధికారికంగా ఉన్న రూ.2,02,890 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని వాహనదారుల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు గుర్తించారు. సునీల్‌ కుమార్‌ను పలు విధాలుగా ప్రశ్నించి సమాధానం రాబట్టారు.

సమీప గ్రామాలకు చెందిన ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రైవేటు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ఎంత కాలంగా పనిచేస్తున్నారు? పని చేసినందుకు రోజుకు ఎంత జీతం చెల్లిస్తున్నారు? తదితర విషయాలపై ఆరా తీశారు.

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ 14400కు ఒక బాధితుడు చెక్‌పోస్టులో జరుగుతున్న అక్రమ వసూళ్లపై గత నెలలో ఫిర్యాదు చేశాడు. అలాగే వాహనదారుల నుంచి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి అనుమతితో సోదాలు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు.

నగదు రహిత విధానం అమలులో ఉన్నప్పటికీ వసూళ్లు
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై నుంచి ఈ చెక్‌పోస్టులో నగదు రహిత విధానాన్ని అమలులోకి తెచ్చింది. చెక్‌పోస్టులో చెల్లించాల్సిన బార్డర్‌ ట్యాక్స్‌, టెంపర్వరీ పర్మిట్‌ ఫీజు, వలంటరీ ట్యాక్స్‌, అపరాధ రుసుం తదితర రకాల చెల్లింపులు పూర్తిగా నగదు రహిత విధానంలోనే చెల్లించాల్సి ఉంది.

అయితే ఆ విధానానికి స్వస్తి చెప్పి అధికారులు నగదు రూపంలో వసూలు చేస్తుండటంతో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు 14400కు జిల్లా నుంచి తరచూ ఫిర్యాదులు వెళ్తున్నాయని డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు.

ఐదేళ్లలో మూడవసారి...
ప్రభుత్వం ఎంతగా నియంత్రిస్తున్నప్పటికీ రవాణా శాఖలో వసూళ్ల పర్వం ఆగడం లేదు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వాహనాలపై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన అధికారులే సొంత జేబులు నింపుకుంటున్నట్లు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది. గ్రానైట్‌ లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ నుంచి రూ.500 మామూళ్లు తీసుకుని వదిలేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

దాని సామర్థ్యం 35 టన్నులకు గాను 61 టన్నుల లోడ్‌తో వెళ్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. 26 టన్నులు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం రూ.500 మామూలు తీసుకుని వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. అధిక లోడ్‌కు ప్రభుత్వానికి రూ.78 వేలు ఆదాయం వస్తున్నప్పటికీ కేవలం రూ.500 తీసుకుని వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. చెక్‌పోస్టులో జరుగుతున్న అక్రమ వసూళ్లపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఈ చెక్‌పోస్టుపై గత ఐదేళ్ల కాలంలో మూడుసార్లు ఏసీబీ తనిఖీలు జరిగాయి. ప్రైవేటు వ్యక్తులతో పాటు ఎంవీఐ డ్రైవర్‌, హోంగార్డు కూడా వసూళ్ల దందాకు సహకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి నివేదిక రూపొందించారు. విద్యాశాఖకు చెందిన ఇద్దరు అధికారులతో పాటు డీటీసీ శ్రీధర్‌ను కూడా అక్కడికి పిలిపించి వారి సమక్షంలో (మధ్యవర్తులు) పంచనామా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement