
వీసీల నియామకంలో తీవ్ర జాప్యం
ఇప్పటికీ 10 వర్సిటీలు ఇన్‌చార్జిల ఏలుబడిలోనే
ఉన్నత విద్యపై సమీక్షలతో సరిపెడుతున్న మంత్రి లోకేశ్
రాష్ట్రంలోని ఉన్నత విద్యారంగంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్యామండలిపై ఉన్నత విద్యాశాఖ ఆధిపత్య పోరు కారణంగా కీలక ఫైళ్ల కదలిక ఆగిపోయింది. ఫలితంగా నెలలు గడుస్తున్నా విశ్వవిద్యాలయాలకు
వైస్ చానల్సర్ల నియామకం ఎటూ తేలడంలేదు. ఫలితంగా విజ్ఞానాన్ని పంచే యూనివర్సిటీల్లో పాలన గాడి తప్పుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైస్ చాన్సలర్లపై కత్తికట్టింది. దాదాపు 17 వర్సిటీ వీసీలను ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేయించింది. ఆనక నెలలు తరబడి ఇన్‌చార్జిల పాలనలోనే వర్సిటీలను గాలికి వదిలేసింది. ఫలితంగా వర్సిటీల్లో బోధనాంశాలు మరుగునపడి వర్గ విభేదాలు రాజ్యమేలుతున్నాయి. – సాక్షి, అమరావతి
9 వర్సిటీలపై స్పష్టత ఏదీ!?
యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో అనుమతి ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత స్రూ్కటినీలో చాలా జాప్యం చేసింది. ఈ ఏడాది జవనరిలో సెర్చ్ కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ కమిటీల నివేదిక ఆధారంగా ఫిబ్రవరిలో గవర్నర్ ఆమోదంతో 9 వర్సిటీలకు వీసీలను నియమించింది. ఇక్కడ 13 వర్సిటీలకు సెర్చ్ కమిటీల సమావేశాలు పూర్తయి నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. అందులో 9 వర్సిటీలకే మోక్షం లభించింది.
మిగిలిన నాలుగు వర్సిటీలకు వీసీల నియామకంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని సమాచారం. తాము ఎన్నిసార్లు సంప్రదించినా స్పష్టత రావడంలేదని ఉన్నత విద్యామండలి అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే యోగి వేమన యూనివర్సిటీ వీసీగా నియమితులైన పి.ప్రకాశ్‌బాబు పాండిచ్చేరి సెంట్రల్ వర్సిటీకి వీసీగా అవకాశం రావడంతో ఇక్కడ రాజీనామా చేశారు.
ఈ వర్సిటీతో కలుపుకుని ఇంకా ఐదు వర్సిటీలకు సెర్చ్ కమిటీ సమావేశాలు జరగాల్సి ఉంది. దాదాపు 11 నెలలు గడుస్తున్నా వర్సిటీలకు వీసీలను నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం గమనార్హం. తాజాగా కర్నూలులోని క్లస్టర్ వర్సిటీ వీసీ పదవీ కాలం ముగియడంతో అక్కడ కూడా ఇన్‌చార్జి పాలనే నడుస్తోంది.
పేరు నచ్చకపోతే ఆపేస్తారా?
వీసీల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు పాతరవేసింది. సెర్చ్ కమిటీల్లో అనర్హులకు స్థానం కల్పించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 13 వర్సిటీలకు గాను 9 వర్సిటీలకు వీసీలను నియమించింది. మిగిలిన వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా సెర్చ్ కమిటీలు సూచించిన పేర్లపై ప్రభుత్వం అయిష్టత చూపిస్తుండటంతోనే జాప్యం చేస్తున్నట్టు సమాచారం. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి నచ్చిన వ్యక్తిని నియమించుకోవాలనుకుంటే సెర్చ్ కమిటీల సమావేశాలు, సిఫారసులతో అవసరం లేకుండా చేసుకోవాలని మండిపడుతున్నారు. నిపుణులతో సెర్చ్ కమిటీ వేసి అందులో తమకు నచ్చిన వారి పేర్లు సిఫారసు చేయమనడం దుర్మార్గమని విమర్శిస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ ప్రకారం వీసీలను ఎంపిక చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎంపిక సమయంలో కాకుండా నోటిఫికేషన్ సమయంలో వర్సిటీల వారీగా వీసీల పోస్టులను రోస్టర్ ప్రకారం రిజర్వ్ చేస్తే అందుకు తగ్గట్టుగానే దరఖాస్తులు చేసుకునే వారమని ఆశావహులు పేర్కొంటున్నారు.
సమీక్షలే.. పురోగతి శూన్యం!
ఉన్నత విద్యపై మంత్రి లోకేశ్ సమీక్షలతో సరిపెట్టడం తప్ప అందులో పురోగతి ఎక్కడా కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 11 నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో వీసీలను నియమించలేక తన అసమర్థతను బయట పెట్టుకుంటున్నారని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యా శాఖకు, ఉన్నత విద్యా మండలికి మధ్య కోల్డ్‌వార్ నడుస్తుంటే తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం గమనార్హం. వీటిన్నింటి పర్యవసానాలు ఉన్నత విద్యా వ్యవస్థను భ్రషు్టపట్టిస్తోందని విద్యావేత్తలు వాపోతున్నారు.
గతంలో కంప్యూటర్ల పేరు స్మరించిన నేతలే ఇప్పుడు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేరుతో ప్రచారం చేసుకుంటూ సాంకేతిక విద్యా సంస్థల్లోని వ్యక్తులను వీసీలుగా నియమించి గొప్పగా చేస్తున్నట్టు మభ్యపెట్టే ప్రయత్నం తప్ప వర్సిటీల్లో క్రమం తప్పకుండా జీతాలిచ్చే పరిస్థితి లేదని మేధావి వర్గం ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి సాంకేతిక సహాయం కావాలంటే జేఎన్‌టీయూలు, తిరుపతి ఐఐటీ నుంచి తీసుకోవచ్చని, ఎక్కడో సాంకేతిక విద్యా సంస్థల్లో పని చేస్తున్నవారే కావాలని ఏరుకోరి తెచ్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.