
సింహగిరిలో కూలిన గోడపై ప్రభుత్వానికి దేవదాయ శాఖ కమిషనర్ నివేదిక
సీఎం, మంత్రులు చెప్పిన అంశాలతో యథాతథంగా నివేదిక
గతనెల దేవదాయశాఖ ఉన్నతాధికారి సమీక్షలో గోడ గురించి ఆరా
చందనోత్సవం నాటికి నిర్మాణం పూర్తి చేయాలంటూ ఆదేశాలు
సాక్షి, అమరావతి: సింహగిరిలో భక్తుల మృతి ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి, ఇతర మంత్రులు ప్రచారం చేసిన అంశాలతోనే నివేదిక సిద్ధమైంది! చందనోత్సవం ఏర్పాట్లను ఏకంగా ఐదుగురు మంత్రులు స్వయంగా పర్యవేక్షించినప్పటికీ ఈ విషాదం చోటు చేసుకోగా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నివేదికను సిద్ధం చేయించింది. వర్షం ఉధృతికి గోడ కూలిపోయిన కారణంగా భక్తులు మరణించినట్లు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ మూడు పేజీల ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
సింహాచలంలో ఎలాంటి కాలమ్స్ లేకుండా కేవలం ఫ్లైయాష్‌తో అంత పెద్ద గోడ నిర్మాణాన్ని ఆదరాబాదరాగా చేపట్టడంతో అది కుప్పకూలి ఏడుగురు భక్తులు సజీవ సమాధి కావడం తెలిసిందే. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృత్యువాత పడితే తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు ఆపసోపాలు పడ్డ కూటమి సర్కారు సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ పేరుతో నాటకాన్ని రక్తి కట్టించి కాంట్రాక్టర్, ఉద్యోగులను బలి పశువులుగా మార్చి తప్పించుకునే యత్నాలు చేస్తోంది. సాక్షాత్తూ మంత్రుల పర్యవేక్షణలోనే ఇంత దారుణం జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఇంజనీరింగ్ నిపుణులు, పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
ఏప్రిల్ 19న మౌఖిక ఆదేశాలు.. తర్వాత గోడ నిర్మాణం
నూతన మెట్ల మార్గాన్ని గతంలో ఉన్నట్లు కాకుండా ప్లాన్ మార్చి ‘వై’ ఆకారంలో నిర్మాణం చేశారని, దీంతో గతంలో మెట్లు ప్రారంభమైన ప్రదేశంలో కూలిన గోడ నిర్మాణం చేపట్టినట్లు దేవదాయ శాఖ కమిషనర్ నివేదికలో పేర్కొన్నారు. గోడకు దిగువన రెండు వైపులా మెట్లు ఉన్నాయని, చందనోత్సవం సందర్భంగా మెట్ల గుండా ఒక వరుస క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెట్లు, గోడను ఈవో సూచనల ప్రకారం నిర్మించినట్లు తెలిసిందన్నారు. కాగా దుర్ఘటనకు కారణమైన గోడకు సంబంధించి ఏప్రిల్ 19వ తేదీన దేవదాయ శాఖ అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చ జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

చందనోత్సవం సమీపించినా గోడ నిర్మాణం చేపట్టకపోవడంపై దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని ముఖ్య అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చందనోత్సవం నాటికల్లా నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ ఇంజనీరింగ్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీంతో కూలిన గోడ ఏప్రిల్ 19వ తేదీ తర్వాతే నిర్మాణం జరిగినట్లు స్పష్టంగా వెల్లడవుతోంది.
హడావుడిగా ఫ్లైయాష్ తో గోడ కట్టేసి కనీసం నాణ్యత పరిశీలించకుండా పక్కనే భక్తుల క్యూలైన్ ఏర్పాటు చేయడంతో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వర్షం కారణంగానే గోడ కూలిందంటూ దుర్ఘటన జరిగిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.