
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని డిక్లేర్ చేసేందుకు హైకోర్టు తిరస్కరించడంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రేపు (మంగళవారం) ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ ఉన్నందున జేఏసీ నేతల నిరాహార దీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. సమ్మెపై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు.
చదవండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఛలో ట్యాంక్‌బండ్ సందర్భంగా పోలీసుల లాఠీఛార్జ్‌లో మహిళా కార్మికులు గాయపడ్డారని, గాయపడిన మహిళలను మంగళవారం గవర్నర్ తమిళిసై వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్టు చెప్పారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగుతుందని హైకోర్టు పేర్కొన్నట్టు తెలిపారు. హైకోర్టు విచారణ అనంతరం రేపు తమ కార్యాచరణపై స్పందిస్తామని చెప్పారు.