
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జరుసలెం మత్తయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జరుసలెం మత్తయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని అన్నారు. మత్తయ్య శనివారం విజయవాడలో మాట్లాడుతూ..ఈ కేసుపై ఎన్నికలకు ముందే దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో తనను బలవంతంగా ఇరికించారని, అంతేకాకుండా రాజకీయంగా తనకు న్యాయం జరగలేదని అన్నారు. హైకోర్టు కూడా తనను నిర్దోషిగా పేర్కొందన‍్న ఆయన.. సుప్రీంకోర్టులో తాను వేసిన కేసులో ఉదయసింహ ఎలా ఇంప్లీడ్ అవుతారని ప్రశ్నించారు. అయితే ఉదయసింహాతో పాటు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అవ్వాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేశారని మత్తయ్య ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసును సీబీఐ, ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఈ నెల 11వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.