రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం రగడ చోటుచేసుకుంది. దాంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. కాగా రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డు కాదని..
హైదరాబాద్ : రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం రగడ చోటుచేసుకుంది. దాంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. కాగా రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డు కాదని, అయితే రాజధాని పేరుతో బలవంతపు భూ సేకరణను ఆ పార్టీ తప్పుబడుతోంది. ఇదే అంశాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ..ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే ఈ అంశంపై సభలో చర్చ ముగిసిందని స్పీకర్ తెలిపారు.
దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిరసనకు దిగారు. బలవంతపు భూసేకరణ అంశంపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...రాజధాని భూసేకరణపై అసెంబ్లీలో చర్చ జరపాలని పదేపదే స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యలపై చర్చకు అనుమతించాలని జగన్ పట్టుబట్టారు.
దీనిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుని ప్రజా రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షం సహకరించాలన్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు ఒక్క రైతు కూడా మద్దతు తెలపలేదన్నారు. వివాదం లేని అంశాన్ని వివాదం చేయాలని ప్రతిపక్షం చూస్తోందని మరోమంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను మరో 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.