బీజేపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చేపట్టిన రాష్ట్ర బంద్‌లో పాల్గొన్న ఆమెను పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మట్లాడుతూ... చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచ రాజకీయమని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబుకు లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.