చదువులే మనల్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ఆంధ్రా యూనివర్సీటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆంధ్ర యూనివర్సిటీ చదువుల దేవాలయం అని కొనియాడారు. ప్రపంచానికే మేధావులను అందించిన గొప్ప చరిత్ర ఏయూది అని ప్రశంసించారు. అలాంటి యూనివర్సీటీలో 549 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ప్రభుత్వంగా తల దించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే విద్యావ్యవస్థలో పలు మార్పులు చేపట్టామని సీఎం జగన్ అన్నారు. ప్రతి పాఠశాలలోనూ 9 రకాల కనీస వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం మూడు దశల్లో నిర్వహిస్తున్నామన్నారు. మెదటి దశలో 15వేల స్కూళ్లలో మరుగుదొడ్లు, త్రాగు నీరు, బ్లాక్ బోర్డు లాంటి మౌలిక వసతులు కల్పించబోతున్నామని తెలిపారు.