పోలవరం ప్రాజెక్టులో మరో రియాల్టీ షోకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగం సిద్ధం చేశారు. 48 గేట్లు అమర్చాల్సిన చోట ఇప్పటికి ఒక గేటు అమర్చుతూ ప్రాజెక్టు పూర్తయినట్లే హడావుడి చేస్తున్నారు. నిజానికి 2018 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గ్రావిటీపై ఆయకట్టుకు నీటిని ఇస్తానని గతంలో చంద్రబాబు పలుమార్లు హామీ ఇచ్చారు. 2018 మరో వారం రోజుల్లో పూర్తి కానున్నా.. ప్రాజెక్టు పనుల్లో కీలకమైన మట్టి, రాతి కట్ట (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు ప్రాథమిక స్థాయిని కూడా దాటలేదు. దీంతో మే, 2019 నాటికి పాక్షికంగానూ.. డిసెంబర్, 2019 నాటికి పూర్తిగానూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు మాట మార్చారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే, అదీ సాధ్యం కాదని భావించిన ఆయన.. వరుస వైఫల్యాలు, పోలవరంలో వేలాది కోట్ల రూపాయల కమీషన్‌ల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోమవారం కొత్త షోకు తెరతీశారు. పోలవరం స్పిల్ వేలో 41వ గేటు స్కిన్ ప్లేట్‌ను అమర్చే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రియాలిటీ షోలలో ఇది ఆదీ కాదు.. అంతమూ కాదు, ప్రజలను మభ్యపెట్టేందుకు ఏదోక హడావుడి చేస్తూనే ఉంటారని సీనియర్ ఐఏఎస్ అధికారులు బాహాటంగా విమర్శిస్తున్నారు.