హిమబిందు.. సాధారణ బ్యాంక్ మేనేజర్ భార్య. పూజలు, పునస్కారాలు తప్ప ప్రపంచం తెలియని అమాయకురాలు. అలాంటి మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు ఆ తర్వాత దారుణంగా హతమార్చారు. ఆమె హత్య నిజం. కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. మరి ఈ దారుణానికి ఒడిగట్టిందెవరనేది తేల్చాల్సిన పోలీసులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అరెస్టు చేసిన వారి వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగిందే తప్ప గట్టి ఆధారాలు సేకరించడంలో పోలీసులు వైఫల్యం చెందారని కోర్టు తీర్పుతో వెల్లడైంది. పటమట శాంతినగర్‌లోని ఎంటీఎస్ టవర్స్‌కు చెందిన సాయిరామ్ భార్య హిమబిందు(41)పై జరిగిన అత్యాచారం, హత్యపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బ్యాంక్ ఉద్యోగులు, మహిళా సంఘాలు, విద్యార్థినులు అప్పట్లో ఆందోళన చేశారు. చివరకు రాష్ట్ర గవర్నరు సైతం హిమబిందు కేసు దర్యాప్తులో పోలీసుల తీరుపై ఆరా తీశారు. వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగం చేశారు. ప్రభుత్వం కూడా కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. సకాలంలో చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో నాలుగో నిందితునిగా పేర్కొన్న జనపాల కృష్ణ బెయిల్‌పై బయటకు వచ్చాడు. దీనిపై ఆగ్రహించిన అప్పటి పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు అప్పటి పటమట ఇన్‌స్పెక్టర్ రవికాంత్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కేసు విచారణ సమయంలో పలుమార్లు పోలీసు కమిషనర్ స్వయంగా కోర్టుకు వెళ్లి పరిశీలించారు. ఎందరెంత మొత్తుకున్నా పోలీసులు తగు విధంగా దర్యాప్తు చేయలేదనడానికి కేసు కొట్టివేత, కోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
Jul 29 2015 10:54 AM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement
