తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై పోటీకి డీఎంకే దూరంగా జరిగింది. ఆమె పోటీ చేయనున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం లేదని డీఎంకే అధినాయకుడు కరుణానిధి తెలిపారు. జయలలితపై అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేసిన తర్వాత.. ఆమె మళ్లీ ఎన్నికయ్యేందుకు వీలుగా ఆర్కేనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకు ప్రాతినిధ్యం వహించడం తప్పనిసరి. దాంతో.. ఆమె త్వరలోనే ఆర్కేనగర్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తాము తమ అభ్యర్థిని బరిలోకి దించడంలేదని కరుణానిధి ప్రకటించడం గమనార్హం.