జిల్లాల యాత్రలో భాగంగా తొలిరోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటిస్తారు. బుధవారం రెండు చోట్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలకు శంకుస్థాపన చేస్తారు. వీటితోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో జిల్లా కార్యాలయాల సముదాయానికి, పోలీసు కమిషనరేట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత సిద్దిపేట మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి పునాది రాయి వేస్తారు. అనంతరం సిద్దిపేట బహిరంగసభలో మాట్లాడతారు. బహిరంగ సభ అనంతరం సిద్దిపేట పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు సిరిసిల్లలో జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.