ఒకవైపు విషాదం.. మరోవైపు జాతీయతాస్ఫూర్తి.. వరదలు ముంచెత్తిన అసోంలో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యమిది. భారీ వరదలు అసోంను అతలాకుతలం చేసినా.. ఆ రాష్ట్రంలో స్వాత్రంత్య దినోత్సవ స్ఫూర్తి చెక్కుచెదరలేదు. చుట్టూ మూగిన నీళ్లలోనూ, పుట్టెడు కష్టాల్లోనూ వీలున్న చోట జాతీయజెండాలు ఎగురవేసి అసోం ప్రజలు తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. పెద్ద ఎత్తున వరదనీళ్లు మూగిన ఓ స్కూల్ ఎదుట చిన్నారులు పీకల్లోతు నీళ్లలో నిలబడి జెండాకు సెల్యూట్ చేస్తున్న ఫొటోను నెటిజన్లను కదిలిస్తున్నది. వరదల్లోనూ వెనుకంజ వేయకుండా వినూత్నరీతిలో జెండాపండుగ చేసుకున్న అసోం వాసులు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఒకరు ఇంటిపైకప్పు మీద జెండా ఎగురవేస్తే.. మరికొన్నిచోట్ల పడవలో నిలబడే ప్రజలకు మువ్వన్నెల జెండాలను ఆవిష్కరించారు. పుట్టెడు దుఃఖంలోనూ జాతీయతాస్ఫూర్తి కొరవడలేదని చాటుతున్నారు.