రష్యా వద్ద తనను ఇబ్బంది పెట్టే సమాచారం ఉందని వచ్చిన కథనాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ‘అదంతా కట్టుకథ. నాపై ఆరోపణలు అవమానకరం. మానసిక రోగులు, నా వ్యతిరేకులు కలసి చేసిన పని’ అని విమర్శించారు. తనపై ఆరోపణలను అమెరికా నిఘా సంస్థలు మీడియాకు లీక్ చేసి ఉండొచ్చని, అదే నిజమైతే వాటి చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. 9 రోజుల్లో అధ్యక్ష పదవి చేపట్టనున్న ట్రంప్ ఆరు నెలల విరామం తర్వాత తొలిసారి బుధవారమిక్కడ కుటుంబ సభ్యుల సమక్షంలో కిక్కిరిసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచాక ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లడం ఇదే తొలిసారి.