కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పరిధిలో నీటి వాటాలు, వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏడాదిగా తలెత్తిన జల వివాదాల విషయంలో తటస్థంగా వ్యవహరిస్తూ వచ్చిన కేంద్రం తొలిసారి ఇరు రాష్ట్రాల అధికారులతో ముఖాముఖి చర్చలు జరిపి, సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు సిద్ధమైంది. కృష్ణా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, వాటాల అంశాలపై ఈ నెల 18న ఢిల్లీలో నిర్వహించే సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుని, అనంతరం తదుపరి చర్యలకు దిగాలని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం అధికారులను ఢిల్లీకి పిలిచిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.