ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదారాబాద్‌లో రేపు చివరి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ సందర్బంగా గ్రేటర్ హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖైరతాబాద్‌లో ఓటు వినియోగించుకోనున్నారు. అయితే ఆయన తన పార్టీకి ఓటు వేసే అవకాశం లేదు. పొత్తులో భాగంగా ఖైరతాబాద్ శాసనసభ, సికింద్రాబాద్ లోక్సభ రెండు స్థానాలు బిజెపికి కేటాయించారు. అందువల్ల ఆయన తన పార్టీకే ఓటువేయలేని పరిస్థితి. ఇదిలా ఉండగా, నగరంలో 379 పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యాత్మకంగా అధికారులు గుర్తించారు. మరో 304 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగా గుర్తించారు. ఈ ప్రాంతాలలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.