● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
నల్లగొండ టౌన్ : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శనివారం నల్లగొండలో జరిగిన దళిత క్రైస్తవుల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రైస్తవ మతంలోకి వెళ్లిన బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య, ఇతర అగ్రకులాల సామాజిక హోదా మారనప్పుడు కేవలం దళితుల హోదా మాత్రమే ఎందుకు మారుతుందని ప్రశ్నించారు. క్రైస్తవ మతంలోకి వెళ్లిన అగ్రకులాలు, బీసీలు, ఎస్టీలు వారి వారి రిజర్వేషన్లు పొందుతున్నప్పుడు దళితులు మాత్రమే రిజర్వేషన్ పొందడానికి ఎందుకు అనర్హులవుతారని ప్రశ్నించారు. దళిత క్రైస్తవులు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే బలంగా నమ్మారని, దళిత క్రైస్తవులను నమ్మించి వారి ఓట్లు వేయించుకొని దారుణంగా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందన్నారు. తాను ఏ పార్టీ వాడిని కానని, తన ఒంటి మీద కండువా ఎప్పటికీ మారదని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అని తీర్పు చెబితే అన్ని రాజకీయ పార్టీలు మౌనం వహించాయని, దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఎవరూ నోరు విప్పలేదని అన్నారు. గతంలో సిక్కు దళితులు, బౌద్ధ దళితులు పోరాటం చేసే సాధించుకున్నట్లుగానే దళిత క్రైస్తవులు కూడా పోరాటం చేసి ఎస్సీ హోదాను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై పోరాటం చేసేందుకు దళిత క్రైస్తవులు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు, జెడ్పీ మాజీ కోఆప్షన్ మెంబర్లు పసల శౌరయ్య, తీగల జాన్‌శాస్త్రి, సమర్పన్ కుమార్, కొంపెల్లి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


