ఉపాధి బాట
పంచాయతీ పోరులో
తిరుమలగిరి (తుంగతుర్తి) : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ ప్రచా రాన్ని ముమ్మరం చేశారు. తమకు కేటాయించిన గుర్తులతో కూడిన కరప్రతాలను ఇంటింటికీ వెళ్లి అందిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పంచాయతీ పోరు కొన్ని రంగాల వారికి ఉపాధిని కల్పిస్తున్నది.
ప్రింటింగ్ ప్రెస్‌ల వారికి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు కేటాయించిన గుర్తులు, తాము గెలిస్తే చేయబోయే పనులను ప్రజలకు వివరించేందుకు అభ్యర్థులు కర పత్రాల పంపిణీ, డోర్ పోస్టర్లు అతికించడం చేస్తున్నారు. అభ్యర్థులు తమ గుర్తులను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. వీటి ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌లకు పరుగులు తీస్తున్నారు. ఒక్కో అభ్యర్థి వందల సంఖ్యలో ఆర్డర్లు ఇస్తుండటంతో ప్రెస్‌ల యజమానులు, అందులో పని చేసే వారికి ఉపాధి లభిస్తోంది.
ఫొటోగ్రాఫర్లు బిజీ
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితం కావడంతో వ్యక్తులకే ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులు తమ ఫొటోలతో ప్రచారం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకే ఫొటో స్టూడియోల బాట పట్టారు. కొందరు ఫొటోగ్రాఫర్లను ఇంటికి పిలిపించుకొని మరీ కొత్త ఫోజుల్లో ఫొటోలు దిగుతున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలపై ముద్రించేందుకు అవసరమైన స్టిల్స్ ఫొటోలు దిగే పనిలో ఉండగా ఫొటోగ్రాఫర్లకు చేతినిండా పని లభిస్తోంది.
ఆటపాటలతో హల్‌చల్
అభ్యర్థులు ప్రచారంలో ఆటా, పాటలతో హల్‌చల్ చేస్తున్నారు. గాయకులతో పాటలు పాడించుకొని ఆటోలు, ఇతర వాహనాలకు మైకులు ఏర్పాటు చేసి గ్రామాల్లో హల్‌చల్ చేస్తున్నారు. మరి కొందరు కళాకారుల ప్రదర్శనలతో అదర గొడుతున్నారు. కోలాటాలు, డప్పులు, నృత్యాలు చేసే వారికి సైతం డిమాండ్ పెరిగింది.
ఫ ప్రచారంలో పాలుపంచుకుంటున్న కళాకారులు
ఫ కరపత్రాలు, ఫ్లెక్సీ ప్రింటింగ్‌కు గిరాకీ
అడిగినంత ఇస్తేనే
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫ్లెక్సీలకు డిమాండ్ పెరిగింది. అభ్యర్థులు ప్రచారం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండడంతో మండల కేంద్రంతో పాటు, పట్టణాలలో ఉన్న ఫ్లెక్సీ దుకాణాల నిర్వాహకులు బిజీగా ఉన్నారు. అభ్యర్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేక మండల కేంద్రాల్లోనే అడిగినంత డబ్బు ఇచ్చి మరీ ప్రింట్ చేయించుకుంటున్నారు.
ఉపాధి బాట


