
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
రామన్నపేట: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ విద్య చాలా కీలకమైనది. చాలామందికి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించాలనే కోరిక ఉంటుంది. కానీ కార్పొరేట్ విద్య పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రతిభ గల పేద విద్యార్థుల కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేట్ విద్యా పథకాన్ని తీసుకొచ్చింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు ఈ పథకం ద్వారా తమ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకానికి సంబంధించి 2025–26 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో నాలుగు వందలకు పైగా మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థులు జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత, ఏయిడెడ్, కస్తూర్బా, నవోదయ, గురుకుల, ఆదర్శ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికై న విద్యార్థులకు కళాశాలతో కూడిన సమాచారం అందిస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం
మీసేవా కేంద్రాల ద్వారా టీఎస్ ఈపాస్ పోర్టల్‌లో telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి తమ పూర్తి వివరాలు, పదో తరగతి మార్కుల ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఆదాయ, కుల ధ్రువపత్రాలను సమర్పించాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలకు మించరాదు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.36వేలు ప్రోత్సాహకం అందించనుంది.
కార్పొరేట్ విద్యా పథకంతో ఉజ్వల భవిష్యత్‌కు ప్రభుత్వ సహకారం
31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి
కార్పొరేట్ విద్యా పథకం ప్రతిభ గల పేద విద్యార్దులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్లపాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య, వసతి కల్పించబడతాయి.
– వసంతకుమారి, యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి

పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య