పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం

Sep 11 2025 6:30 AM | Updated on Sep 11 2025 6:30 AM

పశువు

పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం

నెల క్రితమే టీకాలు వేశాం

వ్యాధి తీవ్రత తగ్గిన తరువాతే

శ్రీవారి క్షేత్రంలో తాత్కాలికంగా గోదానం, గోదత్తత నిలుపుదల

గోసంరక్షణ శాలలో పశువులకు టీకాలు

ద్వారకాతిరుమల : పశువులకు ముద్దచర్మ (లంపీ స్కిన్‌) వ్యాధి వ్యాపిస్తుండటంతో శ్రీవారి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గోదానం, గోదత్తత పథకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ప్రస్తుతం గోసంరక్షణశాలలో మొత్తం 326 పశువులు ఉన్నాయి. పశువైద్యాధికారులు ఇప్పటికే వాటన్నిటికి లంపీ స్కిన్‌ వ్యాధి నివారణా టీకాలు వేశారు. అయితే ఇటీవల ఓ భక్తుడు ఆవు, దూడను దానంగా ఇవ్వగా అందులో దూడకు లంపీ స్కిన్‌ వ్యాధి ఉన్నట్టు గుర్తించిన వైద్యులు, దానికి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ దూడ కోలుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోదానాన్ని స్వీకరిస్తే గోసంరక్షణశాలలోని అన్ని గోవులకు ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉందని పశువైద్యులు దేవస్థానం అధికారులకు సూచించారు. దాంతో గోదానం, గోదత్తతను ఈనెల 6 నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రతిష్టాత్మకంగా గోసంరక్షణ

గోదానం ఎంతో విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు శ్రీవారికి గోవులను దానంగా ఇస్తుంటారు. వాటిలో కొన్నింటిని దేవస్థానం రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం దత్తత ఇస్తోంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రతినెలా రెండవ, నాల్గవ శనివారాల్లో ఆవులను దత్తత ఇస్తున్నారు. ఏడాదిలో ఒకసారి దేవస్థానం అధికారులు రైతుల వద్దకు వెళ్లి వారిచ్చిన గోవులను పరిశీలిస్తున్నారు. అలాగే గోసంరక్షణశాలలో ఉన్న గోవుల పోషణపట్ల అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

తెల్ల పశువుల్లోనే వ్యాధి తీవ్రత

తెల్ల పశువులు అయిన ఆవులు, ఎద్దుల్లోనే ఎక్కువగా ఈ వ్యాధి తీవ్రత కనిపిస్తుంది. లంపీ స్కిన్‌ అనే వైరస్‌ వల్ల కలిగే ఈ వ్యాధి పశువుల రక్తం పీల్చే దోమలు, ఈగలు, పిడుదుల ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సులభంగా వ్యాపిస్తుంది. అది కూడా అక్టోబర్‌ నుంచి జనవరి మధ్యలోనే ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అందుకే పశువైద్యాధికారులు, సిబ్బంది గోసంరక్షణశాలలోని గోవులకు సెప్టెంబర్‌లోనే టీకాలు వేశారు.

జాగ్రత్తలు తప్పనిసరి

పశువులకు లంపీ స్కిన్‌ వ్యాధి సోకకుండా ముందుగానే టీకాలు వేయించాలి. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం వచ్చి, చర్మంపై బొబ్బలు, బుడిపెలు, పొక్కులు ఏర్పడి, నెమ్మదిగా అవి పగిలి పుండ్లుగా మారి, మేత సరిగ్గా తినకపోవడం, నోరు, ముక్కు నుంచి చొంగ కారడం, పాల దిగుబడి తగ్గడం, అలసటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే దాన్ని లంపీ స్కిన్‌ వ్యాధిగా గుర్తించాలి. వాటిని మంద నుంచి వేరు చేసి, చికిత్స అందించాలి. దోమ తెరలు, లేదా వేపాకు పొగ వేయాలి. గంజి వంటి ఆహార పదార్థాల్లో కాస్త ఉప్పు కలిపి తాగించాలి. జ్వరం తగ్గే వరకు ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని ఇవ్వాలి. జ్వరం తగ్గడానికి మెలోక్సికామ్‌, ఆనాల్జిన్‌ మందులను వైద్యుల సూచనల మేరకు వాడాలి. సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే యాంటీ బయాటిక్‌, న్యూమోనియా లక్షణాలు ఉంటే అవిల్‌, సీపీఎం వంటి మందులు వాడాలని పశువైద్యులు తెలిపారు. వ్యాధి పూర్తిగా తగ్గిన ఆవులనే దానంగా ఇవ్వాలి.

గోసంరక్షణశాలలోని షెడ్డులో ఉన్న ఆవులు , గోసంరక్షణశాలలో లంపీ స్కిన్‌ వ్యాధి నుంచి కోలుకున్న ఆవుదూడ

శ్రీవారి గోసంరక్షణశాల లోని ఆవులకు, గిత్తలకు, దూడలకు నెల క్రితమే లంపీ స్కిన్‌ వ్యాధి నివారణా టీకాలు వేశాం. బయట నుంచి కొత్తగా పశువులు లోపలికి వస్తే ప్రస్తుతం ఉన్న ఆవులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అందుకే కొత్త వాటిని రాకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచించాం. వారు వెంటనే అప్రమత్తమై గోదానం, గోదత్తతను నిలిపివేశారు.

– అంగర సురేష్‌, పశువైద్యాధికారి, ద్వారకాతిరుమల

లంపీ స్కిన్‌ వ్యాధి విస్తరిస్తున్న నేపధ్యంలో పశువైద్యాధికారుల సూచనల మేరకు భక్తుల నుంచి గోవులను దానంగా తీసుకోవడం, అలాగే రైతులకు గోవులను దత్తత ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశాం. వ్యాధి తీవ్రత తగ్గిన తరువాత మళ్లీ వాటిని పునఃప్రారంభిస్తాం. ఆ సమాచారాన్ని ముందుగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం.

– ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, శ్రీవారి దేవస్థానం ఈఓ

పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం 1
1/3

పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం

పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం 2
2/3

పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం

పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం 3
3/3

పశువుల్లో ‘లంపీ’తో అప్రమత్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement