
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ
నరసాపురం: నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంలో బుధవారం ఓ పాత కేసుకు సంబంధించి విచారణ నిర్వహించారు. ఉదయం 11 గంటల సమయంలో ఏసీబీ సీఐ(ఏలూరు) కె.బాలకృష్ణ సిబ్బందితో కలసి కార్యాలయనికి వచ్చి విచారణ చేపట్టారు. 2023లో వీరభద్రరావు సబ్‌రిజిస్ట్రార్‌గా ఉండగా అక్రమ భూ రిజిస్ట్రేషన్‌పై ఫిర్యాదులు అందడంతో అప్పటిలో ఏసీబీ అధికారులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అప్పటి సబ్‌రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు. కేసు దర్యాప్తు చివరి దశకు చేరడంతో మరోమారు సమగ్ర దర్యాప్తు నిమిత్తం మళ్లీ ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా ఏసీబీ సీఐ బాలకృష్ణ మాట్లాడుతూ పాతకేసు దర్యాప్తులో భాగంగా విచారణ జరిపినట్టు చెప్పారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని వివరించారు. ఏసీబీ విచారణతో రోజంతా పూర్తిగా రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి.
18న డీఎస్సీ–2003 ఉపాధ్యాయుల నిరసన
భీమవరం: డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు మెమో–57 అమలుచేస్తూ ఓపీఎస్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 18న ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎస్సీ –2003 ఉపాధ్యాయుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సూర్యప్రకాష్, బుధవారం ఒక ప్రకటన లో కోరారు. రాష్ట్రంలో నూతన పింఛన్ విధానం సీపీఎస్ అమలుకుముందే నియామకం పూర్త యిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్రం ప్రకటించిన మెమోను అమలుచేయాలని కోరారు. తమ డిమాండ్స్ సాధనకు ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
న్యాయ సేవలపై
అవగాహన కల్పించాలి
ఏలూరు (టూటౌన్): న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బుధవారం బైక్ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలను అవగాహన కలిగిస్తున్నామని, అందులో భాగంగా బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. విద్యావంతులైన పౌరులు మారుమూల గ్రామా లలోని ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాస మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులికృష్ణ, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.రఘునాథ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, ప్రభుత్వ న్యాయవాది బి.జె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పంటలు ఎండుతున్నా
ప్రభుత్వానికి పట్టదా?
ఏలూరు(టూటౌన్): కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు– కై కలూరు రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎండిన వరి నారు మట్టి గడ్డలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు నీరు అందించి పంటలు కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు రూరల్ ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పోర్స్ మోహరించినా రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక నారుమళ్ళు, నాట్లు వేసిన చేలు ఎండిపోతున్నా ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ