 
															అవినీతి జాఢ్యాన్ని తరిమికొట్టాలి
విజయనగరం: అవినీతి జాఢ్యాన్ని తరిమికొట్టి సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక అవగాహన వారోత్సవా ల్లో భాగంగా గురువారం విజయనగరం మున్సిప ల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమ్య ఉద్యోగులందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అవినీతితో ఏ ఒక్కరూ మనశ్శాంతిగా ఉండలేరన్నారు. లంచం, అవినీతికి పాల్పడిన వారు ఏసీబీ నుంచి తప్పించుకోలేరన్న విషయాన్ని గమనించాలని హితవు పలి కారు. పూర్తి ఆధారాలతో మాత్రమే ఏసీబీ కేసు నమోదు చేస్తుందని, ఎంతటి వారైనా ఈ తరహా నేరంలో బయటపడలేరని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని నిర్వహించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని కోరారు. మనిషికి ఉన్న అత్యాశే అవినీతికి ప్రధాన కారణమన్నారు. లంచంతో పట్టుబడితే శిక్ష పడడమే కాకుండా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడం అంటే మన పాపాన్ని మనమే పెంచుకుపోతున్నట్లు అర్థమన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ సమాజంలో అవినీతి లేకుండా నిజాయితీగా సేవలు అందించిన నాడే ఏ అధికారికై నా, ఉద్యోగికై నా పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, ఏసీబీ సీఐ మహేశ్వర రావు, కార్పొరేషన్ ఉద్యోగులు, అవినీతి నిరోధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
