చెట్టు కిందనే చదువులు | - | Sakshi
Sakshi News home page

చెట్టు కిందనే చదువులు

Oct 31 2025 9:26 AM | Updated on Oct 31 2025 9:26 AM

చెట్ట

చెట్టు కిందనే చదువులు

చెట్టు కిందనే చదువులు

పాఠశాలలో వర్షపు నీరు చిమ్మడంతో తప్పని పరిస్థితి

పార్వతీపురం రూరల్‌: అభం శుభం తెలియని చిన్నారుల చదువు చెట్టు కిందకు చేరింది. బడికి వెళ్తే ఏ పైకప్పు పెచ్చులూడి పడుతుందో, ఏ గోడ కూలుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇది పార్వతీపురం మండలం బిత్రటొంకి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దయనీయ దుస్థితి. సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరిన ఈ పాఠశాల భవనం, ‘మోంథా’ తుఫాన్‌ కారణంగా కురుస్తున్న వర్షాలకు మరింత అధ్వానంగా మారింది. గురువారం ఉదయం తరగతులు జరుగుతుండగా, పైకప్పు నుంచి ఒక్కసారిగా నీరు ధారగా చిమ్మడంతో ఆ గదిలో ఉన్న ఏడుగురు విద్యార్థులు భయాందోళనతో బయటకు పరుగుపెట్టారు.

గత్యంతరం లేక.. వృక్షం నీడలో..

తరగతి గదిలో పై కప్పునుంచి నీటి ధారలు కారడంతో, చేసేదేమీ లేక ఉపాధ్యాయుడు విద్యార్థులను సమీపంలోని ఓ చెట్టు కిందకు తరలించారు. వర్షపు జల్లుల మధ్య, చలికి వణుకుతూనే చిన్నారులు చెట్టు నీడన అక్షరాలు దిద్దాల్సిన దుస్థితి ఏర్పడడం చూసిన పలువురిని కలిచివేసింది.

‘నాడు’ వైభవం.. ‘నేడు’ నిర్లక్ష్యం..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ‘నాడు–నేడు’ పథకం కింద సర్కారీ బడులు ప్రైవేట్‌ సంస్థలకు దీటుగా రూపుదిద్దుకున్నాయి. విద్యకు అత్యంత ప్రాధాన్యం దక్కింది. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనడానికి బిత్రటొంకి పాఠశాలే సజీవ సాక్ష్యం. ‘నాడు’ పొందిన వైభవం.. ‘నేడు’ కనీస మరమ్మతులకు నోచుకోక కునారిల్లుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాలలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, శిథిల భవనం స్థానంలో నూతన భవనం నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చెట్టు కిందనే చదువులు1
1/1

చెట్టు కిందనే చదువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement