 
															మొక్కుబడిగా మంత్రి పర్యటన
● అధికారులతో రివ్యూకే పరిమితం
● పునరావాస కేంద్రం వైపు కన్నెత్తి చూడని మంత్రి
పాచిపెంట: మోంథా తుఫాన్ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గురువారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించి అనంతరం పెద్దగెడ్డ జలాశయాన్ని సందర్శించి వెనుదిరిగారు, మంత్రి పర్యటన కేవలం అధికారులతో రివ్యూకే పరిమితమవడం పట్ల పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఏదో మొక్కుబడికి వచ్చినట్లు అలా వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులను పక్కన కూర్చోబెట్టుకుని అధికారులతో నాలుగు మాటలు మాట్లాడితే సరిపోతుందా? మంత్రి రివ్యూ నిర్వహించిన తహసీల్దార్ కార్యాలయానికి 200మీటర్ల దూరంలో ఉన్న పద్మాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఉన్న పునరావాస కేంద్రానికి వెళ్లకపోవడం, అక్కడ విద్యార్థులు పడుతున్న కష్టాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం కానీ, శిథిలావస్థలో ఉన్న ఆశ్రమ పాఠశాల భవనాన్ని పరిశీలించే అవసరం కానీ మంత్రికి లేవా? లేక గిరిజన విద్యార్థుల అవస్థలు గిరిజన మంత్రి పరిధిలోని కావా..అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల పర్యటించి నేలమట్టమైన వరి, పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి రైతు కష్టం తెలుసుకునే ప్రయత్నం మంత్రి చేయకపోవడంతో మండలంలో మంత్రి పర్యటన మరిన్ని విమర్శలకు తావిస్తోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
