 
															ప్రాణంపోతున్నా సమాజంలో వెలుగు నింపిన అమరులు
పార్వతీపురం రూరల్: పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీసులు గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కూడలి వద్ద అమరవీరుల చిత్రపటాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ, దీపం ఆరిపోతూ కూడా ప్రకాశవంతమైన వెలుగునిస్తుంది. అదేవిధంగా పోలీసుల త్యాగాలు కూడా. ప్రాణం పోతున్నా సమాజంలో వెలుగును నింపి అమరులయ్యారని కొనియాడారు. వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని నిష్పాక్షికంగా ప్రజాసేవ చేస్తామన్నారు. 24 గంటలు ప్రజా రక్షణ కోసం నిలబడేది పోలీస్ శాఖ మాత్రమేనని, వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు రమణమూర్తి, మురళీధర్, రంగనాథం, ఏఆర్ ఆర్‌ఐలు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసు అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
