
విశాఖ సిటీ: నగరంలో గుర్తించిన యాచకులను వారి కుటుంబాల చెంతకు చేర్చేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు జ్యోతిర్గమయ కార్యక్రమం ద్వారా నగరంలో భిక్షాటన చేస్తున్న 243 యాచకులను పోలీసులు ఇప్పటికే రెస్క్యూ చేసి వారిని పలు ఆశ్రమాల్లో ఆశ్రయం కల్పించారు. వీరిలో 115 మందిని వారి కుటుంబాలకు అప్పగించారు. మిగిలిన 128 మంది యాచకులను వారి వివరాలను తెలుసుకునేందుకు ఏయూటీడీ డే–నైట్ హోంలెస్ షెల్టర్ ఆధ్వర్యంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యాచకులకు ఆధార్ ఉన్నదీ, లేనిదీ, వారి వేలిముద్రల ఆధారంగా పరిశీలించారు. కార్యక్రమాన్ని సీపీ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షించారు. వివరాల ప్రకారం యాచకులను వారి కుటుంబాలకు చేర్చాలని పోలీసులను సీపీ ఆదేశించారు.