12 నెలలుగా 430 కోట్ల బకాయిలు | - | Sakshi
Sakshi News home page

12 నెలలుగా 430 కోట్ల బకాయిలు

Jul 2 2025 5:18 AM | Updated on Jul 2 2025 5:18 AM

12 నెలలుగా 430 కోట్ల బకాయిలు

12 నెలలుగా 430 కోట్ల బకాయిలు

● బిల్లులు చెల్లించండి మహాప్రభో! ● జీవీఎంసీ కాంట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వేడుకోలు

డాబాగార్డెన్స్‌: బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కాంట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.వి.వి.నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎం. సంజీవరెడ్డి కోరారు. అప్పులు చేసి పనులు పూర్తి చేసిన ఎందరో చిన్న కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల కోసం జీవీఎంసీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న వారు కొందరైతే.. అనారోగ్యం బారిన పడిన వారు మరికొందరున్నారని తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిందని ఎంతో ఆశపడ్డామని, అయితే ఏడాదిగా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో చాలా మంది కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం నిధి పోర్టల్‌ను ఏర్పాటు చేసిందని, అయితే దీని వల్ల కాంట్రాక్టర్లకు పెద్దగా లాభం లేదన్నారు. పాత బిల్లులు అందులో అప్‌లోడ్‌ కావడం లేదని వివరించారు. గత 12 నెలలుగా సుమారు రూ.430 కోట్లు బకాయిలున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని చిన్న పనులకు టెండర్లు పిలిచి రద్దు చేయడం, ఆ పనులను పెద్ద కాంట్రాక్టర్లకు ఒకేసారి అప్పగించడం వల్ల చిన్న కాంట్రాక్టర్లకు పనులు లేకుండా పోయాయన్నారు. అధికారిక ఆమోదం లేకపోయినా పనులు పూర్తి చేసిన తర్వాత ఫైల్‌ ప్రాసెసింగ్‌లో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఫైల్‌ మెయింటెనెన్స్‌ సరిగ్గా లేకపోవడంతో మెయిన్‌ ఆఫీస్‌కి, జోనల్‌ ఆఫీస్‌కి మధ్య సరైన కమ్యూనికేషన్‌ లేక కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారని వివరించారు. ఈ సమస్యలపై మేయర్‌ పీలా శ్రీనివాసరావు, కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ స్పందించి కాంట్రాక్టర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అసోసియేషన్‌ నాయకులు కోరారు. అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎం.రమేష్‌, ప్రతినిధులు శ్రీనివాసరావు, జి.సింహాచలం, బి.కృష్ణ, అప్పలనాయుడు, రవికుమార్‌, పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement